ఎన్డీఏ భేటీ.. పవన్ కళ్యాణ్‌కు ఆహ్వానం

Update: 2023-07-15 17:02 GMT

ఊహించినట్టుగానే ఎన్డీఏ భేటీకి రావాలని జనసేన పార్టీకి ఆహ్వానం అందింది. ఈ నెల 18న ఢిల్లీలోని అశోకా హోటల్లో జరిగే జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) సమావేశానికి హాజరు కావాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్‌కు పిలుపొచ్చింది. ఆయనతోపాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ సమావేశానికి హాజరు కానున్నారు. ఒకరోజు ముందుగానే వీరు హస్తనకు చేరుకుంటారని జనసేన శనివారం ఓ ప్రకటనలో తెలిపింది. బీజేపీతో పవన్ దగ్గరగా మసలుకుంటున్న సంగతి తెలిసిందే. అటు అధికార వైసీసీ, ఇటు విపక్షాలైన టీడీపీ, జనసేన కూడా కాషాయ పార్టీకి అతి సన్నిహితంగా ఉండడంతో ఏపీలో వింత రాజకీయ పరిస్థితి నెలకొంది. బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని చాలా రోజులుగా ఊహాగానాలు వస్తున్న సంగతి తెలిసిందే. జగన్ కూడా మోదీ ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ ప్రభావం ఏపీపై ఎంతవరకు ఉంటుందన్నది ఆసక్తికరం. కాగా, టీడీపీకి కూడా ఎన్డీఏ ఆహ్వానం అందిందని వార్తలు వచ్చినా ఆ పార్టీ ఇంతవరకు దీనిపై స్పందించలేదు. ఎన్డీఏకి మాజీ మిత్రుడైన చంద్రబాబు తరచూ ఢిల్లీ వెళ్లి మోదీని, ఇతర బీజేపీ పెద్దలను కలుస్తున్నారు. ఎన్నికల్లో పొత్తు ఖాయమని, సీట్ల లెక్కే తేలాల్సి ఉందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. 


Tags:    

Similar News