Khalistani terrorists:కెనడా ఉగ్రవాదులపై ఉక్కుపాదం.. 19 మంది ఆస్తులు సీజ్
కెనడా భారత్ మధ్య వైరం రోజురోజుకు ముదురుతుంది. కెనడాలోని భారత వ్యతిరేక శక్తులను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తులు చేస్తుంది. ఇటీవల కెనడాలోని భారతీయులు తిరిగి స్వదేశానికి వెళ్లిపోండని సిఖ్స్ ఫర్ జస్టిస్ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ బెదిరించాడు. కాగా పంజాబ్ లోని గురుపత్వంత్ సింగ్ కు సంబంధించిన ఆస్తులను ఎన్ఐఏ జప్తు చేసింది. తాజాగా మరో ముందడుగు వేసిన ఎన్ఐఏ.. వివిధ దేశాల్లో నివసిస్తున్న మరో 19 మంది ఖలిస్థానీ ఉగ్రవాదుల ఆస్తుల జాబితాను సిద్ధం చేసింది.
వీరు వివిధ దేశాల్లో ఉంటూ.. ఖలిస్థాన్ సానుభూతిపరులు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. బ్రిటన్, అమెరికా, కెనడా, దుబాయ్, పాకిస్థాన్‌తోపాటు ఇతర దేశాల్లో ఉంటున్న ఖలిస్థానీలను.. భారత్ ఇప్పటికే ఉగ్రవాదులుగా ప్రకటించింది. వీళ్ల హవాలా కార్యకలాపాలు, స్థానిక ఆస్తులపై ఎన్‌ఐఏ దృష్టి పెట్టింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నివారణ చట్టం కింద వీళ్ళపై చర్యలకు సిద్ధమైంది ఎన్‌ఐఏ. ఈ ఉగ్రవాదులను క్రిమినల్స్ జాబితాలో చేర్చుతూ 43 మంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పేర్లను విడుదల చేసింది. కాగా ఈ లిస్ట్ లో ఉన్న ఎక్కువమంది ఉగ్రవాదులు కెనడాలోనే ఉన్నట్లు తెలిపింది.