బీచ్‎లో ఎంట్రీ ఫీజుపై విమర్శలు...వెనక్కు తగ్గిన ప్రభుత్వం

Update: 2023-07-09 14:54 GMT

రుషికొండ బీచ్ చూసేందుకు ఎంట్రీఫీజు పెట్టడంపై విమర్శలు రావడంతో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది. బీచ్‌కు వచ్చే పర్యాటకులు ఎటువంటి ప్రవేశ రుసుమును చెల్లించక్కర్లేదని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని గుడివాడ అమర్నాథ్ ప్రకటించారు. బీచ్‎లో సదుపాయాలు కల్పించే బాధ్యత, అవసరమైన ఖర్చు ప్రభుత్వానిదే అన్నారు. బ్లూ ఫ్లాగ్ హోదా లభించిన బీచ్‎లకు కేంద్ర ప్రభుత్వ నిబంధనలు ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుసుము వసూలు చేయాలని కేంద్రమే కోరిందని తెలిపారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఎటువంటి ఫీజు చేయదని స్పష్టం చేశారు. బీచ్ లో ఎంట్రీ ఫీజు వసూలు చేస్తున్నట్లు వస్తున్న వార్తలను నమ్మొద్దన్నారు మంత్రి అమర్నాథ్ . ఈ ప్రకటన విడుదల చేయకమందు మీడియా సమావేశంలో మాట్లాడిన మంత్రి...బీచ్ నిర్వహణకు ఫీజు అవసరం ఉందన్నారు. మళ్లీ గంటల వ్యవధిలోనే మాట మార్చేయడం చర్చనీయాంశమైంది.

రుషికొండ బీచ్‎లో ప్రవేశానికి రూ.20 ఎంట్రీ ఫీజు పెడుతున్నట్లు శనివారం పర్యాటక శాఖ అధికారుల నుంచి ప్రకటన వెలువడింది. ఈనెల 11వ తేది నుంచి ఈ నిర్ణయం అమలు కానుందని తెలిపారు.బ్లూఫ్లాగ్‌ బీచ్‌ నిర్వహణ, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసమే ఈ రుసుము వసూలు చేస్తున్నట్లు వివరించారు. ఈ ప్రకటన వెలువడిన కాసేపటికే విమర్శలు వచ్చాయి. పర్యాటకులతో పాటు విపక్షాలు సముద్రాన్ని చూసేందుకు ఎంట్రీ ఫీజ్ పెట్టడాన్ని వ్యతిరేకించారు. దీంతో ఏపీ ప్రభుత్వం వెనక్కు తగ్గింది.


Tags:    

Similar News