రాజ్యసభలో సభ్యులు లేని పార్టీగా టీడీపీ

By :  Bharath
Update: 2024-02-15 15:10 GMT

రాజ్యసభ ఎన్నికల నామినేషన్ గడువు ముగిసింది. సంఖ్యాబలం లేకపోవడంతో టీడీపీ ఈసారి అభ్యర్థులెవరినీ బరిలో నిలపలేదు. దీంతో తెలుగుదేశం పార్టీకి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. 41 ఏళ్ల చరిత్రలో ఆ పార్టీకి రాజ్యసభలో ఒక్క సభ్యుడు కూడా లేకపోవడం ఇదే తొలిసారి. ఏపీలో రాజ్యసభ స్థానాలకు జరగనున్న ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో.. ఆ మూడు స్థానాలు అధికార వైసీపీ ఖాతాలో పడనున్నాయి. దీంతో రాజ్యసభలో వైసీపీ సంఖ్యాబలం 8 నుంచి 11కు చేరనుంది. టీడీపీకి మరో రెండేళ్ల వరకు పెద్దల సభలో ప్రాతినిధ్యం లభించే అవకాశం లేదు.

నిజానికి వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు తమకు మద్దతిస్తారని టీడీపీ భావించింది. చివరకు ఆశలు వదులుకుంది. పార్టీ సీనియర్లతో చర్చలు చంద్రబాబు… రాజ్యసభకు పోటీ చేసే నిర్ణయాన్ని విరమించుకున్నారు. గతంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో చడీచప్పుడు లేకుండా పోటీకి దిగి ఒక స్థానాన్ని గెలుచుకున్న టీడీపీ ఈసారి కూడా అదే స్ట్రాటజీ ఫాలో అవుతుందన్న ఊహాగానాలు వినిపించారు. వైసీపీలో అభ్యర్థుల మార్పు నేపథ్యంలో చాలా మంది అసంతృప్త నేతలు టీడీపీ వైపు మొగ్గుచూపుతారన్న వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో రాజ్యసభ ఎన్నికలు టీడీపీకి అను కూలంగా మారుతాయని అంతా భావించారు.

మరోవైపు ఎన్డీయే కూటమిలో చేరేందుకు చంద్రబాబు చర్చలు సాగిస్తుండటంతో బీజేపీతో కలిసి ప్లాన్ అమలు చేస్తారని అంతా భావించారు. టీడీపీ అభ్యర్థిగా సీఎం రమేశ్‌ను బరిలో నిలుపుతారన్న ప్రచారం కూడా జరిగింది. అందుకు తగ్గట్లుగానే టీడీఎల్పీ సిబ్బంది అసెంబ్లీ సెక్రటేరియెట్ నామినేషన్ వేసేందుకు అప్లికేషన్ కూడా కొన్నారు. అయితే చివరి నిమిషంలో టీడీపీ అధినేత చంద్రబాబు నిర్ణయం మార్చుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కేవలం నలుగురు ఎమ్మెల్యేలతో తమ పని సులువుగా కానిచ్చిన టీడీపీ.. రాజ్యసభ ఎన్నికల్లో 25 నుంచి 26 మంది మద్దతు కూటగట్టడం కష్టం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఏపీలో ముగ్గురు రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర (టీడీపీ) , బీజేపీ సభ్యుడు సీఎం రమేశ్‌, వైఎస్సార్‌ సీపీ సభ్యుడు వేమిరెడ్డి పదవి కాలం ఏప్రిల్‌ 2న ముగియనుంది. నామినేషన్లకు చివరి రోజైన గురువారం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి ముగ్గురు మాత్రమే నామినేషన్లు వేశారు. ప్రతిపక్షం నుంచి ఎవరూ పోటీకి దిగకపోవడంతో ఈ ముగ్గురి ఎన్నిక లాంఛనం కానుంది.




Tags:    

Similar News