ఉత్తర కొరియా నియంత కిమ్ ప్రయాణించిన రైలు ప్రత్యేకతలు ఇవే..
ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యాలో ఎంటర్ అయ్యారు. కిమ్ కోసమే ప్రత్యేకంగా తయారు చేయించిన భారీ సాయుధ రైలులో దాదాపు 20 గంటలు ప్రయాణించి కిమ్ రష్యా చేరుకున్నారు. కిమ్ రాకను రష్యా వర్గాలు ధ్రువీకరించాయి. ఇవాళ కిమ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ భేటీలో కీలకమైన ఒప్పందాలు చేసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా రష్యాకు ఉక్రెయిన్ యుద్ధం చేసేందుకు పెద్ద ఎత్తు శతఘ్ని గుండ్లు, ఇతర మందుగుండు సామగ్రి అవసరం ఉంది. దీనికి సంబంధించి కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ భేటీ విషయం పక్కన పెడితే ఇప్పుడు ప్రత్యేకించి అందరి దృష్టి కిమ్ ప్రయాణించిన రైలుపై పడింది. దీని స్పెషాలిటీ ఏమిటో తెలుసుకునేందుకు అంతా ఆసక్తి చూపిస్తున్నారు.
కిమ్ ప్రయాణించిన రైలుకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ముదురు పచ్చ రంగులో ఉన్న ఈ రైలు పేరు తయాంఘో. అంటే కొరియాలో సూర్యుడు అని అర్థం. నార్త్ కొరియా ఫౌండర్ కిమ్ ఇల్ సంగ్‌కు గుర్తుగా దీనికి ఈ పేరును పెట్టారు. సాధారణంగా మిగతా రైళ్ల మాదిరిగా ఇది వేగంగా ప్రయాణించలేదు. ఈ రైలు కేవలం గంటకు 50 కిలో మీటర్ల స్పీడుతోనే ప్రయాణిస్తుంది. ఈ రైలుకు భారీగా అమర్చిన సాయుధ కవచాలు కారణంగా రైతులు ఇంతకంటే స్పీడుగా వెళ్లలేదు. ఈ ట్రైన్‌కు భారీ ఆర్మడ్ ఫోర్సర్ ప్రొటెక్షన్ ఉంటుంది. స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్న ఈ సాయుధ దళాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగా స్టేషన్లను, రూట్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తుంటారు. ఈ బుల్లెట్ ప్రూఫ్ రైలులో దాదాపు 90 కోచ్‌లు ఉంటాయి.
ఇక ఈ రైలులో విలాసాలకు లోటే ఉండదు. కిమ్ కోసం రుచికరమైన ఎన్నో వంటకాలను ఎప్పటికప్పుడు రెడీగా ఉంచుతారు. మరీ ముఖ్యంగా రష్యన్, చైనీస్, కొరియన్, జపనీస్, ఫ్రెంచి వంటకాలను వడ్డించేందుకు చెఫ్‌లు సిద్ధంగా ఉంచుతారు . ఈ విషయాన్ని అప్పట్లో కిమ్‌తో రైలులో ప్రయాణించిన రష్యన్ కమాండర్ తెలిపారు. విందే కాదు మందుకు కొదవ లేదు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన వైన్లు ఈ రైలులో అందుబాటులో ఉంటాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్ రైల్లో కూడా ఇన్ని విలాసవంతమైన సౌకర్యాలు ఉండవు.
ఉత్తర కొరియా నియంత అయ్యి ఉండి ఇలా రైలులో ప్రయాణించడమేంటని అందరికీ కాస్త ఆశ్చర్యంగా ఉండవచ్చు. తలచుకుంటే క్షణాల్లో విమానాల్లో ప్రయాణించవచ్చు కదా ఎందుకు ఇన్ని గంటల ప్రయాణం అనుకోవచ్చు. కానీ దానికి ఓ స్టోరీ ఉందట. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్‌కు విమానాలంటే భయంట. అందుకే ఆయన ఎక్కువశాతం రైలులోనే ప్రయాణించేవారట. 2001లో ఆయన మాస్కోకు వెళ్లాల్సి వచ్చినప్పుడు ఏకంగా 10 రోజులపాటు రైలులో ప్రయాణించారట. ఇప్పుడు నియంత కిమ్ జోంగ్ ఉన్ కూడా అదే ఫార్ములాను ఫాలో అవుతున్నారు. అయితే కిమ్ మాత్రం అవసరమైతేనే అప్పుడప్పుడు విమానాల్లో ప్రయాణిస్తారట.