ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి జూలై 4న ఢిల్లీ వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 5వ తేది ఉదయం ప్రధాని మోదీతో జగన్ సమావేశం కానున్నారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ అవుతారని సమాచారం. వివేకా హత్య కేసులో సీబీఐ తాజా చార్జిషీటు, జగన్ అక్రమాస్తుల కేసుల విచారణ సీబీఐ కోర్టులో మళ్లీ ప్రారంభం కావడం నేపథ్యంలో జగన్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. ఏపీ రాజకీయ పరిస్థితులపై కూడా బీజేపీ పెద్దలతో చర్చిస్తారని వార్తలు వస్తున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీచేస్తాయనే ప్రచారం నేపథ్యంలో జగన్ పర్యటన ఆసక్తిరేపుతోంది. అయితే వైసీపీ నాయకులు మాత్రం రాష్ట్ర అభివృద్ధిపై చర్చించేందుకు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసమే జగన్ ఢిల్లీ వెళ్తున్నట్టు చెబుతున్నారు.