ఉభయగోదావరి జిల్లాల్లో వైసీపీతో సై అంటే సై అన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. గోదావరి జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు రానివ్వను అని శపథం చేశారు. వచ్చే ఎన్నికల్లో జనసేన జెండా ఎగరాలని పిలుపునిచ్చారు. భీమవరం వారాహియాత్రలో పవన్ మాట్లాడుతూ వైసీపీపై విరుచుకుపడ్డారు. " భీమవరంలో ఓడిపోయినా నేను పట్టించుకోలేదు. మనకు ఓటమి, గెలుపు ఉండవు.. ప్రయాణమే ఉంటుంది. వైసీపీ ప్రభుత్వ పాలనలో వ్యవస్థలు నాశనమయ్యాయి.రెండున్నర లక్షల ఉద్యోగాల హామీని గాలికొదిలేశారు. రాష్ట్రానికి పరిశ్రమలు తేవడంలో ప్రభుత్వం విఫలమైంది. మధ్యాపాననిషేధ హామీ అని చెప్పి అధిక రేట్లకు అమ్ముతున్నారు. రాష్ట్రంలో ప్రతిభావంతులు విదేశాలకు తరలిపోతున్నారు. భీమవరం నుంచి ఎందరో విదేశాలకు వెళ్లి రాణించారు. ఐటీ, ఇంజినీరింగ్ నిపుణులు ఇక్కడే ఎక్కువమంది ఉన్నారు. సరైన రాజకీయ వ్యవస్థ లేకుంటే మనకు లాభం ఉండదు. కులాల పరిధి దాటి ఆలోచించాలి. వచ్చే ఎన్నికల్లో జనసేనకు అందరూ ఓటు వేయాలి. జనసేన సత్తా ఎంటో అసెంబ్లీలో చూపెడతాం. ప్రజల కోసం పవన్ కల్యాణ్ పోరాటం ఆగదు. దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి. అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు అండగా ఉంటాం" అని పవన్ కల్యాన్ హామీ ఇచ్చారు.
తాత ప్రోద్బలంతో ఎస్‌ఐను కొట్టారు..
వైసీపీ నేతలు తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారంటూ పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో తనకు బాగా తెలుసన్నారు.హైదరాబాద్‌లో పెరిగిన సీఎం జగన్ వ్యక్తిగత జీవితం గురించి తనకు బాగా తెలుసని చెప్పారు. వైసీపీ మంత్రుల చిట్టా మొత్తం విప్పగలను అంటూ హెచ్చరించారు. తాను చెప్పేది వింటే జగన్ చెవుల్లో నుంచి రక్తం కారుతుందన్నారు. చిన్న వయసులోనే తాత ప్రోద్బలంతో ఎస్‌ఐ ప్రకాశ్‌బాబుని స్టేషన్‌లో పెట్టి సీఎం జగన్ కొట్టారని పవన్ ఆరోపించారు. పోలీసు వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి జగన్.. రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించారని మండిపడ్డారు. గంజాయిని రాష్ట్ర పంటగా, గొడ్డలిని రాష్ట్ర ఆయుధంగా మార్చారని పవన్ కల్యాణ్ విమర్శించారు.