నేను అందరు వలంటీర్లను అనలేదు : పవన్ కల్యాణ్

Update: 2023-07-11 12:56 GMT

ఏపీలో వలంటీర్స్‌పై పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు కాకరేపుతున్నాయి. జనసేనాని వ్యాఖ్యలను వైసీపీ నాయకులు, వలంటీర్స్ తీవ్రంగా తప్పుబడుతున్నారు. పవన్ స్టార్ కామెంట్స్‌కు వ్యతిరేకంగా వలంటీర్స్ రోడ్డెక్కారు. పవన్ మాత్రం తన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మరోసారి స్పష్టం చేశారు. వలంటీర్స్ అంతా తప్పు చేస్తున్నారని తాను చెప్పలేదని పవన్ క్లారిటీ ఇచ్చారు. అయితే వ్యవస్థలో ఒక్కరు తప్పు చేసినా అందరినీ అంటారని చెప్పుకొచ్చారు.

అమ్మాయిల అదృశ్యంపై మాట్లాడాలి..

వలంటీర్స్ ద్వారా ప్రజలను సీఎం జగన్ కంట్రోల్ చేస్తున్నాడని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వలంటీర్లను ప్రజలు ఇప్పుడు కంట్రోల్ చేయకపోతే వ్యవస్థ ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. వలంటీర్స్ వ్యవస్థకు ఎవరూ వ్యతిరేకం కాదని..వారు వాళ్ల పనిచేయకుండా అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారని మండిపడ్డారు. ఉపాధి హామీ కూలీల కంటే తక్కువగా వలంటీర్ల వేతనాలు ఉన్నాయన్నారు. ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం వలంటీర్ల వద్ద ఉందని పవన్ ఆరోపించారు.అమ్మాయిల అదృశ్యంపై వైసీపీ నేతలు ఎందుకు స్పందించరని ప్రశ్నించారు.

నా భార్య ఏడుస్తోంది..

అసలు విషయాన్ని వైసీపీ నేతలు పక్కదోవ పట్టించి తనపై విమర్శలకు చేస్తున్నారని జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీప నాయకుల మాటలకు తన భార్య కూడా ఏడుస్తోందని తెలిపారు. కానీ నేను సర్దిచెప్పుకుని ముందుకు వెళ్తున్నట్లు వివరించారు. బాధ్యత తీసుకున్నాని తిరిగి వెనక్కు రాలేనని తన భార్యకు చెప్పినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. తన వల్ల మాట పడుతున్నందుకు క్షమించమని తన భార్యను కోరినట్లు వెల్లడించారు.


Tags:    

Similar News