Pawan Kalyan : కాకినాడ నుంచి పవన్ పోటీ.. జనసేన వర్గాల్లో సంబరాలు!

Byline :  Shabarish
Update: 2024-03-09 11:21 GMT

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువైంది. టీడీపీ, జనసేన సరసన బీజేపీ చేరడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తుకు సంబంధించి గత మూడు రోజులుగా పార్టీ నాయకుల మధ్య అనేక చర్చలు జరిగాయి. వారి చర్చలు సంతృప్తికరంగానే ముగిశాయి. పొత్తులో భాగంగా 6 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ, 2 లోక్‌సభ స్థానాల్లో జనసేన పోటీ చేయనున్నాయి.

ఇకపోతే 24 అసెంబ్లీ స్థానాల్లో జనసేన, 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేయనుండగా మిగిలిన 145 అసెంబ్లీ స్థానాలు, 17 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులకు కేటాయించారు. ఈ తరుణంలో జనసేన వర్గాల్లో సందడి వాతావరణం నెలకొంది. అటు టీడీపీ అభ్యర్థులు కూడా ఈసారి తమదే విజయం అంటున్నాయి. పొత్తు తర్వాత మూడు పార్టీలు వైసీపీని ఓడించడం ఖాయమని చెప్పుకుంటున్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన మధ్య పొత్తు కుదిరిన తర్వాత ఈసారి వైసీపీ పని అయిపోయిందని అనుకుంటున్నారు.

ఢిల్లీలో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు ఒప్పందం జరిగింది. దీంతో జనసేన, బీజేపీ అభ్యర్థులు ఏయే స్థానాల్లో పోటీ చేస్తారనే విషయంపై ఓ అంచనా వచ్చింది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకూ ఏ అసెంబ్లీ స్థానంలో పోటీ చేస్తారనే విషయం ప్రకటించలేదు. కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి పవన్ బరిలోకి దిగుతారని, కొత్త జాబితాలో ఆయన పేరు ప్రచారంలోకి వచ్చింది. కాకినాడ ఎంపీ స్థానంలో పవన్, మచిలీపట్నం ఎంపీ స్థానంలో వల్లభనేని బాలశౌరిలు జనసేన నుంచి బరిలోకి దిగనున్నారు. దీంతో జనసేన అభిమానులు, కార్యకర్తల్లో సందడి వాతావరణం నెలకొంది.

రాజంపేట నుంచి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, రాజమండ్రి నుంచి పురందేశ్వరి, ఏలూరు నుంచి సుజనా చౌదరి, నరసాపురం నుంచి రఘురామకృష్ణ రాజు, అనకాపల్లి నుంచి సీఎం రమేశ్ పోటీలో ఉంటారని బీజేపీ వర్గాల సమాచారం. ఇకపోతే హిందూపురం అభ్యర్థిపై ఇంకా స్పష్టత రాలేదు. మొత్తానికి బీజేపీ పెద్ద స్కెచ్చే వేసిందని పలువురు అంటున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీల పొత్తుతో ఈసారి అధికార పార్టీ వైసీపీ విజయం సాధించదని పలువురు చర్చించుకుంటున్నారు.


Tags:    

Similar News