భవిష్యత్లో ఓట్ల కోసం డబ్బు ఖర్చు చేయాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ఏపీలోని భీమవరంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓట్ల కోసం నాయకులు డబ్బు ఖర్చు చేయాల్సిందేనని చెప్పారు. కనీసం భోజనాలు కూడా పెట్టకపోతే ఎలా అని ప్రశ్నించారు. అయితే 2029 తర్వాత అయినా డబ్బులతో ఓట్లు కొనలేని పరిస్థితి రావాలని ఆకాంక్షించారు. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జనసేన పనిచేస్తుందని చెప్పారు. జనసేన టీడీపీ కూటమి గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
టీడీపీ జనసేన కూటమి బీజేపీ ఆశీర్వాదం ఉండాలని పవన్ అన్నారు. టీడీపీ జనసేన బీజేపీ పొత్తు కోసం ఎంతో కృషి చేసినట్లు చెప్పారు. రాష్ట్రం కోసం అన్నీ భరించానని వ్యాఖ్యానించారు. పొత్తులో భాగంగా త్యాగాలు చేసిన వారికి తగిన ప్రాధాన్యత ఉంటుందని స్పష్టం చేశారు. జగన్ సిద్ధం అంటే తాము యుద్ధం అంటున్నామని అన్నారు. కుటుంబాలు విచ్ఛిన్నం చేసే వ్యక్తి జగన్ అని విమర్శించారు. వివిధ కులాలు కొట్టుకోవాలనేదే జగన్ నైజమని.. కానీ సమాజాన్ని కలిపేవారినే జనం గుర్తించుకుంటారని అన్నారు.
ఆస్తిలో సొంత చెల్లికే వాటా ఇవ్వని జగన్.. ప్రజలకు ఏం మంచి చేస్తారని పవన్ ప్రశ్నించారు. అప్పులు తెచ్చి బటన్లు నొక్కడం కూడా గొప్పేనా అని విమర్శించారు. అభివృద్ధి చేసే బటన్ నొక్కితే ప్రజలు గౌరవిస్తారని చెప్పారు. టీడీపీ జనసేన కూటమి అధికారంలోకి వస్తే పథకాలు ఆగిపోతాయని జగన్ అసత్యాలు ప్రచారం చేస్తున్నారని పవన్ ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక పథకాలు కొనసాగిస్తామని చెప్పారు. తాను వైసీపీ విమర్శలకు భయపడి వెనక్కి వెళ్లే మనిషిని కాదని.. 2019లో సీట్లు గెలవకున్నా పార్టీని నిలబెట్టుకున్నామని స్పష్టం చేశారు.