సీఐ అంజూయాదవ్‌పై ఎస్పీకి ఫిర్యాదు చేసిన పవన్ కళ్యాణ్

Update: 2023-07-17 08:04 GMT

శ్రీ కాళహస్తి సీఐ అంజూయాదవ్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌. ఈ రోజు ఉదయం మంగళగిరి పార్టీ కార్యాలయం నుండి రోడ్డు మార్గాన గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం కు చేరుకున్న పవన్.. ప్రత్యేక విమానంలో తిరుపతికి వచ్చారు. అక్కడి నుంచి తన పార్టీ కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా తిరుపతిలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్నారు. జనసేన సైనికులపై శ్రీ కాళహస్తి సీఐ అంజు యాదవ్ ప్రవర్తించిన తీరుపై ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్‌రెడ్డికి .. అంజూ యాదవ్ పై ఫిర్యాదు చేస్తూ.. ఎస్పీకి వినతి పత్రం అందజేశారు.

శ్రీకాళహస్తిలో జనసేన పార్టీ నిర్వహించిన ఆందోళనలో సీఐ అంజూ యాదవ్ తీవ్రంగా రియాక్టయిన విషయం తెలిసిందే. నిరసనకారులను అదుపుచేసే క్రమంలో జనసేన లీడర్ కొట్టె సాయిపై ఆమె చేయిచేసుకున్నారు. ఇతర కార్యకర్తలు, అభిమానులపైనా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జనసేన కార్యకర్తపై చేయిచేసుకున్న శ్రీకాళహస్తి సీఐ అంజూయాదవ్ పై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పవన్ కల్యాణ్ సోమవారం ఉదయం తిరుపతి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సీఐపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.

ఈ ఉదయం రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో దిగిన జనసేనానికి ఘన స్వాగతం లభించింది. పార్టీ కార్యకర్తలు, అభిమానులతో 15 కిలోమీటర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. తిరుపతి ఎస్పీ కార్యాలయం చేరుకున్న పవన్.. సీఐ అంజూయాదవ్ చేతిలో దెబ్బలు తిన్న కొట్టే సాయితో పాటు మరో ఆరుగురితో కలిసి ఎస్పీ పరమేశ్వర్ రెడ్డిని కలుసుకుని ఫిర్యాదు అందజేశారు. కాగా అంతకుముందు ఈ ఘటనపై స్పందించిన పోలీసు ఉన్నతాధికారులు.. సీఐ అంజూ యాదవ్ కు ఛార్జ్ మెమో జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై జిల్లా ఎస్పీ ఇప్పటికే విచారణ నిర్వహించి డీజీపీకి నివేదిక ఇచ్చినట్లు సమాచారం.

Tags:    

Similar News