ప్రజలను కలిపేవాడే నాయకుడు.. విడగొట్టేవాడు కాదన్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కేవలం రెండు కులాలే ఆర్థిక వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకోవాలంటే కుదరదని.. అన్ని కులాలు బాగుపడాలని చెప్పారు. ఏపీ నాయకుల దోపిడీ వల్ల తెలంగాణ నేతలు మనల్ని తిట్టారన్నారు. కీలకమైన పదవులను రెడ్డి సామాజిక వర్గానికే ఇస్తారా? మిగతా కులాల వారిలో ప్రతిభ లేదాఅని ప్రశ్నించారు.
వారాహి విజయయాత్రలో భాగంగా కోనసీమ జిల్లా ముమ్మిడివరం బహిరంగ సభలో పవన్ ప్రసంగించారు. " వైసీపీ ప్రభుత్వం వంద మంది కష్టాన్ని 30 మందికి పంచి ఓటు బ్యాంకు చేసుకున్నారు. వైసీపీ ప్లాన్స్ ప్రజలకు అర్థం కావాలి. నా వద్ద రూ.వేల కోట్లు లేవు.. సుపారీ గ్యాంగులు లేవు. జాతీయ నేతల స్ఫూర్తితోనే రాజకీయాల్లోకి వచ్చా. మన అనైక్యత వల్లే కొంత మంది నేతలు మనల్ని భయపెడుతున్నారు. ఉభయ గోదావరి, కోనసీమ జిల్లాల ప్రజలకు నేను అండగా ఉంటా. ఏపీ సీఎం.. ఒక ఎంపీని కొట్టించగలరు. ఒక ఎమ్మెల్సీ.. ఎస్సీ వ్యక్తిని చంపి డోర్ డెలివరీ చేయగలరు. చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీని సీఎం శభాష్ అంటారు. మనం అనైక్యంగా ఉంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వమే వస్తుంది. ప్రజాస్వామ్యంలో పిలిచి మాట్లాడాలి. వైసీపీ ప్రభుత్వం.. ఉప్మా ప్రభుత్వం. కులం గురించి మాట్లాడితే ఆ పార్టీ నేతలకు ఇబ్బందిగా ఉంది. వారు మాత్రం మాట్లాడొచ్చు" అని పవన్ మండిపడ్డారు.
జనసేన హామీలు..
అధికారంలోకి వస్తే అన్ని వర్గాల వారికి అండగా ఉంటామని జనసేన అధినే పవన్ కల్యాన్ హామీ ఇచ్చారు. యువతకు పెట్టుబడి కింద ఉచితంగా రూ.10లక్షలు సాయం చేస్తామన్నారు. రైతులకు దగ్గరగా మిల్లులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. నదుల నుంచి ఇసుక దోపిడీని అడ్డుకుంటామన్నారు.