వారి చేతుల్లో బందీగా రాయలసీమ.. పవన్ షాకింగ్ కామెంట్స్
రౌడీయిజానికి తాను భయపడనని, ఇది 2009 కాదని..2024 అనే విషయాన్ని సీఎం జగన్ గుర్తు పెట్టుకోవాలని జనసేన అధినేత పవన్ సీరియస్ అయ్యారు. తన్ని తగలేస్తే ఊరుకోమని, వారిని కూడా తన్ని తగలేస్తామన్నారు. తాను సుగాలి ప్రీతి, కొట్టే సాయి వంటి వారి కోసమే రాజకీయాల్లో కొనసాగుతున్నట్లు చెప్పుకొచ్చారు. పుష్ప సినిమా చూసేందుకు బావుంటుదని, కానీ ఎర్రచందనం స్మగ్లింగ్ చేసే వాళ్లని నిజ జీవితంలో భుజానికి ఎత్తుకోలేమన్నారు.
తిరుమలలో అడ్డగోలుగా దోపిడీ జరుగుతోందని, గతంలో పింక్ డైమండ్ పోయినట్లు రమణ దీక్షితులే స్వయం చెప్పారని, అలాంటి రమణ దీక్షితులే ఇప్పుడు టీటీడీలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడ్డం లేదన్నారు. నలుగురి చేతుల్లో రాయలసీమ బందీగా ఉందన్నారు. తనకు తొడకొట్టడాలు తెలీదన్నారు. నేడు ఆరణి శ్రీనివాస్ జనసేనలో చేరారని, ఆయనతో తనకు 2008 నుంచి పరిచయం ఉన్నట్లు చెప్పుకొచ్చారు. 2009లో కొద్దిపాటి ఓట్ల తేడాతో ఆరణి శ్రీనివాస్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ఏమీ ఆశించకుండా పార్టీలో పనిచేయడానికి ఆరణి సిద్ధమయ్యారన్నారు.
రాయలసీమ పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, జగన్ రెడ్డిల సొంతం కాదన్నారు. రాయలసీమలో బలం ఉన్నోడిదే రాజ్యం అన్నట్టుగా ఉందన్నారు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డితో తనకేం శతృత్వం లేదన్నారు. తాను కర్నూలు వెళితే లక్షన్నర మంది జనం వచ్చి సుగాలి ప్రీతి తల్లికి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు. జనసేన ఒత్తిడి కారణంగానే సుగాలి ప్రీతి కేసు సీబీఐకు ఇచ్చారన్నారు. రాయలసీమలో నిరసన తెలపాలని వస్తే మద్దతు తెలుపుతున్నారని, ఎన్నికల్లో మాత్రం భయపడుతున్నారని పవన్ అన్నారు. రాయలు ఏలిన సీమ ఇప్పుడు కొందరి కబంధ హస్తాల్లో ఉండిపోయిందని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు.