భీమవరం టు పిఠాపురం..జనసేనాని ప్లాన్ అదే

Byline :  Shabarish
Update: 2024-02-28 14:02 GMT

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ భీమవరం, గాజువాక నుంచి రెండు చోట్ల పోటీచేశారు. అయితే రెండు చోట్లా పవన్ ఘోర పరాజయాన్నే మూటగట్టుకున్నారు. ఈసారి ఎన్నికల్లో అలాంటి ఓటమి రాకూడదనే ఉద్దేశంతోనే పవన్ ముందుచూపుగా ఆలోచించారు. గత ఎన్నికల మాదిరిగా కాకుండా ఈసారి ఒకే నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఆయన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి తూర్పు గోదావరి జిల్లాకు మారనున్నారట.

ఈసిరి భీమవరం, గాజువాక నుంచి కాకుండా పిఠాపురం నుంచి బరిలోకి దిగేందుకు పవన్ చూస్తున్నారట. పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కచ్చితంగా విజయం సాధిస్తాననే ధీమాతో పవన్ ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎన్నికలకు ముందుగానే అలర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పిఠాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తే గెలుపు మాత్రమే కాకుండా భారీ మెజార్టీ వచ్చేలా వ్యూహాలు రచిస్తున్నారట.

ఏడెనిమిది నియోజకవర్గాల్లో సర్వే చేస్తే ఆఖరికి పిఠాపురం నుంచి పోటీ చేస్తే విజయం సాధించే అవకాశం ఉన్నట్లు తేలిందట. అందుకే అక్కడి నుంచే పోటీ చేసేందుకు పవన్ సిద్ధమవుతున్నాడు. దానిపై మరో రెండ్రోజుల్లో స్పష్టత రానుంది. టీడీపీతో పొత్తు పెట్టుకున్న జనసేన 24 స్థానాల్లో పోటీ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇంకొన్నిరోజుల్లో సీట్ల సర్దుబాటు కూడా జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఏపీలో పార్టీ జంపింగ్‌లు, అలకలు, ఆరోపణలు, పొత్తుల మధ్య రాజకీయం సాగుతోంది. మొత్తానికి ఈసారి ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి.

Tags:    

Similar News