Mahasena Rajesh:'పోటీ నుంచి తప్పుకుంటాను'.. టీడీపీ అభ్యర్థి సంచలన నిర్ణయం!
మరో రెండు నెలల్లో రాబోయే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి మహసేన రాజేశ్ సంచలన ప్రకటన చేశారు. "కులరక్కసి చేతిలో మరోసారి బలైపోయాను.. జగన్ రెడ్డీ... గుర్తుపెట్టుకుంటాను! .. పోటీ నుండి నేనే స్వచ్చందంగా తప్పుకుంటాను! నాకోసం నా పార్టీనీ, చంద్రబాబుగారినీ, పవన్ కళ్యాణ్ గారినీ, లోకేష్ గారినీ ఎవ్వరూ తిట్టొద్దు" అంటూ పి.గన్నవరం టీడీపీ అభ్యర్థి సరిపెల్ల రాజేష్ అలియాస్ మహాసేన రాజేష్ విడుదల చేసిన వీడియో వైరల్ అవుతోంది.
వీడియోలో రాజేష్... కనీసం పోటీ కూడా చేయనివ్వకుండా ఎంత సెంటిమెంట్ బ్లాక్ మెయిల్ పార్టీ మీదకి తీసుకోస్తున్నారని వైసీపీ పార్టీ పై ఆరోపణలు చేశారు. మా వర్గాలు ఎప్పుడు బాగుపడాలి.. ప్రశ్నించే వారు ఉండొద్దు.. అని వైసీపీపై విమర్శించారు. ప్రశ్నించే వారికి చంద్రబాబు అసెంబ్లీ టికెట్ ఇస్తే.. పోటీ చేయనీయకుండా వ్యవస్థతో అడ్డుకుంటున్నారని చెప్పారు. తనను హిందూ ద్వేషిగా చిత్రీకరిస్తున్నారని, పార్టీకి చెడ్డపేరు రావొద్దని, అందుకోసమే పోటీ నుంచి తప్పుకోవడం మంచిదని ఆ వీడియోలో చెప్పారు. దీంతో ఆయన పోటీ నుంచి వైదొలుగుతున్నారని కొంత మంది ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ ఆ వీడియోలో కావాలంటే వైదొలుగుతాను అన్నారు కానీ వైదొలిగాను అని చెప్పలేదు. దీంతో కిందిస్థాయి నుంచి ఓ దళితుడు ఎదుగుతూంటే తట్టుకోలేకపోతున్నారని.. ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఆయన ఈ తరహా వీడియో చేసినట్లుగా తెలుస్తోంది.
రాజేశ్ గతంలో హిందూమతంపై, అగ్రవర్ణాల అమ్మాయిలపై అసభ్యకరంగా వ్యాఖ్యలు చేసినట్లు కొందరు టీడీపీ-జనసేన కార్యకర్తలే ఆరోపిస్తున్నారు. రాజేశ్ అభ్యర్థిగా తప్పించకుంటే.. తామే ఓడిస్తామని స్థానిక కార్యకర్తలు హెచ్చరిస్తున్నారు. రాజేశ్ ప్రచారంకి వెళ్లిన ప్రాంతాల్లో కూడా తీవ్రంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలపై అన్నివర్గాల వారు తీవ్ర అసహనం, ఆగ్రహంతో ఉన్నారు. ఆడపిల్లలను కించపరిచే వ్యక్తికి టికెట్ ఇస్తే ఎలా గెలిపిస్తామంటూ పి.గన్నవరం టీడీపీ,జనసేన నేతలు అంటున్నట్లు టాక్ నడుస్తోంది.