వాలంటీర్లపై వ్యాఖ్యలు.. పవన్ కళ్యాణ్‌పై కేసు నమోదు..

Update: 2023-07-13 04:46 GMT

ఏపీ ప్రభుత్వ వాలంటీర్లపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో పవన్ కళ్యాణ్‌పై పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు సచివాలయ ఉద్యోగి. దీంతో విజయవాడలో కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు పోలీసులు. నగరంలో 228 సచివాలయంలో పనిచేస్తున్న అయోధ్య నగర్‌కు చెందిన దిగమంటి సురేష్ బాబు ఈ ఫిర్యాదు చేశారు. ఏలూరు వారాహి యాత్రలో వాలంటీర్లపై జనసేనాని వ్యాఖ్యలపై 405/ 2023 కింద ఫిర్యాదు స్వీకరించి.. పవన్‌పై సెక్షన్ 153, 153A, 505(2) IPC సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. పవన్ వ్యాఖ్యల మూలంగా రెండు వర్గాల మధ్య గొడవలు జరిగి శాంతి భద్రతలకు విఘాతం కలిగే ప్రమాదం ఉందని సెక్షన్లు చేర్చారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు

వాలంటీర్లు సంఘ విద్రోహ శక్తులకు సమాచారం ఇస్తున్నారంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపాయి. మహిళలకు పెద్ద సంఖ్యలో గల్లంతవుతున్నా.. వారి అచూకీ కనిపెట్టడంలో పోలీసులు విఫలమయ్యారని ఇటీవల పవన్ ఆరోపించారు.దేశంలో మహిళల అక్రమ రవాణా ఏపీలోనే ఎక్కువ జరుగుతోందని, వాలంటీర్లు మహిళల సమాచారాన్ని అసాంఘిక శక్తులకు చేరవేస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో ఉండే మహిళల సమాచారాన్ని పక్కదారి పట్టిస్తున్నారని పవన్ ఆరోపించడంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించారు.

నమోదు చేసిన సెక్షన్లు ఇవే

సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజల మధ్య చిచ్చు రాజేసేందుకు ప్రయత్నించినందుకు ఐపీసీ 153 ప్రకారం కేసు నమోదు చేశారు. బహిరంగ వేదికపై ఈ వ్యాఖ్యలు చేసినందుకు 153ఏ సెక్షన్ కూడా చేర్చారు. వాలంటీర్లను అవమానించేలా, నిందపూర్వక వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ 502(2) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.

Tags:    

Similar News