2 నెలల్లో ఏపీలో ఏమవుతుందో చూద్దాం.. విజయసాయి రెడ్డిపై కేఏ పాల్ సీరియస్..
వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డిపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆయన చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు. ఆ కామెంట్లు వింటే బీజేపీ అధికార ప్రతినిధా లేక మోడీకి తొత్తా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టేది నీవా, అంత దమ్ముందా అని ప్రశ్నించారు. అసలు ఏపీలో రానున్న రెండు నెలల్లో ఏమవుతుందో తెలుసా అని నిలదీశారు. ఐదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రానికి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, రాజధాని, ఉద్యోగ కల్పన గురించి ఏ రోజైనా ఆలోచించారా అని మండిపడ్డారు.
ఒళ్లు దగ్గర పెట్టుకుని తెలుగు ప్రజల కోసం పనిచేయండి
సిద్ధం అని అంటున్న వైసీపీ దేనికి సిద్ధంగా ఉందో చెప్పాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు. వారు ఓడిపోవడానికి సిద్ధమా..? సర్వనాశనం చేయడానికి సిద్ధమా..? లేక దోచుకోవడానికి సిద్ధమా..? క్లారిటీ ఇవ్వాలని అన్నారు. మోడీ తొత్తులతో పోరాటం చేయడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో విశాఖపట్నం ఎంపీగా కేఏ పాల్ ప్రజాశాంతి పార్టీ తరఫున పోటీకి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ఆయన విజయసాయిరెడ్డిపై విమర్శలు చేసినట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇటీవలే తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీ వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చాలా నష్టపోయిందని మండిపడ్డారు. తెలంగాణ ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అమలు చేయలేని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఇలా అందరినీ మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం త్వరలో కూలిపోతుందని అన్నారు.