బురద రోడ్డులో 5 కి.మీ. నడిచిన నిండు గర్భిణి.. ఇంతకన్నా దుస్థితి ఉంటుందా..!

Update: 2023-06-29 10:53 GMT

అసలే వర్షాకాలం. ఉండేది అటవీ ప్రాంతం. గ్రామానికి ఉన్న మట్టిరోడ్డంతా బురద మయం. పైగా నిండు గర్భిణి.. ఆంబులెన్స్ వెళ్లే సదుపాయం లేక.. అదే రోడ్డులో ఆ గర్బిణి నడుచుకుంటూ హాస్పిటల్ కు వెళ్లాల్సిన పరిస్థితి. మనుషులు.. విమానం ఎక్కి ఆకాశంలోకి, రాకెట్లు ద్వారా అంతరిక్షంలోకి వెళ్తున్న కాలంలో గిరిజన గ్రామాలకు సరైన రోడ్లు లేక అవస్థలు పడుతున్న దుస్థితి నెలకొంది. ఏపీలోని విశాఖ ఏజెన్సీ ఏరియాలో రోడ్లు లేక నిండు గర్భిణి ఈ నరకయాతన అనుభవించింది.

అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం చీపురుగొందికి చెందిన కొర్రా కావ్య(29)కు బుధవారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆంబులెన్స్ సాయం కోరగా.. గ్రామానికి రోడ్డు సదుపాయం లేదని రావడానికి నిరాకరించారు. దాంతో ఆ నిండు గర్భిణి 5 కి.మీ. బురద రోడ్డులో నడవాల్సి వచ్చింది. కిముడుపల్లి గ్రామ పంచాయితీకి నడుచుకుంటూ రాగా.. అక్కడి నుంచి పాడేరు హాస్పిటల్ కు ఆంబులెన్స్ లో తరలించారు. గతంలో కూడా ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి. లక్సరిపుట్లు గ్రామానికి చెందిన ముగ్గురు గర్భిణులు, అనారోగ్యానికి గురైన మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. రోడ్డు సదుపాయం లేకపోవడం వల్ల చనిపోతున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామానికి రోడ్డు మార్గం కల్పించాలని అధికారులను కోరుతున్నారు. 

Tags:    

Similar News