ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా రూ.100 స్మారక నాణేన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము విడుదల చేశారు. కార్యక్రమానికి జేపీ నడ్డా, టీడీపీ అదినేత చంద్రబాబు, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఎన్టీఆర్ కుటుంబీకులు, సినీ, రాజకీయ రంగ ప్రముఖులు, ఎంపీలు హాజరయ్యారు. హైదరాబాద్ మింట్ కాంపౌండ్‌లో ఈ ఎన్టీఆర్ స్మారక నాణేన్ని తయారు చేశారు. ఈ కార్యక్రమానికి దాదాపుగా 200 మంది అతిధులకు ఆహ్వానం అందింది .
విడుదల చేసిన ఎన్డీఆర్ 100 రూపాయల వెండి నాణెం 44 మిల్లీమీటర్ల చుట్టుకొలతతో మొత్తం నాలుగు లోహాలను కలిగి ఉంది. 50 శాతం వెండి, 40 శాతం రాగి, 5 శాతం నికెల్, 5 శాతం జింక్ ఆ నాణెంలో ఉంది. నాణెంలో ఓ వైపు ఎన్టీఆర్ బొమ్మ ఉంటే మరోవైపు మూడు సింహాల బొమ్మ ఉంది. ఎన్టీఆర్ శత జయంతి అని హిందీలో రాసి దాని కింద 1923-2023 అని రాసి ఉంది. నాణెం విడుదల సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ.. భారత చలనచిత్ర రంగం ఉన్నతిలో ఎన్టీఆర్ పాత్ర కీలకమని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. రాముడు, కృష్ణుడి రూపాలను ప్రజలు ఆయనలో చూసుకున్నారని తెలిపారు. భారతీయ సినిమా చరిత్రలో ఎన్టీఆర్ ఎంతో ప్రత్యేకమని చెప్పారు. రాజకీయాల్లోనూ ఎన్టీఆర్ ప్రత్యేకత చాటుకున్నారని తెలిపారు.
కృష్ణా జిల్లా నిమ్మకూరులో 1923 మే 28న జన్మించిన నందమూరి తారక రామారావు స్వయంకృషితో సినీ రాజకీయ రంగాల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో అత్యున్నత స్థానాన్ని చేరుకుని..ఆ తరువాత తెలుగువారి ఆత్మగౌరవం నినాదంతో పార్టీ స్థాపించి అధికారం చేపట్టారు.