ఎన్నాలకెన్నాళ్లకు చిక్కిన పులస..ఒక్క చేప ధర ఎంతో తెలుసా?
పులుస చేప..ఈ పేరు వినగానే గోదావరి జిల్లాల ప్రజలకు నోరూరిపోతుంది. ఎంతో ఖరీదైన ఈ చేపను ఒక్కసారైనా తినాలనుకుంటారు. కేవలం వర్షాకాలంలో మాత్రమే లభించే ఈ చేప అంత అమోఘంగా ఉంటుంది మరి. జూలై మొదలు సెప్టెంబర్ వరకు పులస చేపలు కనిపిస్తాయి. వీటి టేస్ట్ ఒక్కసారి చూస్తే జీవితంలో మరిచిపోలేరు. అందుకే జనం ఈ చేపలు కనిపిస్తే చాలు ఎగబడిపోతారు. ధర ఎంతైనా సరే కొనేందుకు రెడీ అవుతారు. ఈ పులస చేపకు ఉన్న క్రేజ్ అలాంటిది.
గతేడాదితో పోలిస్తే.. ఈసారి పులసల రాక కాస్త తగ్గిందనే చెప్పాలి. మార్కెట్లో ఒకటి, రెండు కేజీల చేపలు మాత్రమే లభిస్తున్నాయి. అది కూడా గత నెలలో ఎప్పుడో ఒకటి రెండుసార్లు చేపలు చిక్కియి. మళ్లీ 15 రోజుల గ్యాప్ తర్వాత పులస చేప మత్స్యకారుల వలలో చిక్కింది. కాకినాడకు సమీపంలోని యానాంలోని మత్స్యకారులకు ఈ పులస చిక్కింది. దీంతో రికార్డు స్థాయిలో ఈ చేప అమ్ముడుపోయింది.
మంగళవారం సాయంత్రం మత్స్యకారుల వలలో రెండు కిలోలకుపైగా బరువున్న పులస చిక్కింది. ఈ చేపను కొల్లు నాగలక్ష్మి అనే మహిళ వేలంలో రూ.19 వేలకు కొనుగోలు చేసింది. ఆ చేపను రావులపాలెంకు చెందిన ఓ ప్రముఖ రాజకీయ నేత ఆమె నుంచి రూ.26 వేలు చెల్లించి పులస చేపను తీసుకువెళ్లారు. చాలా రోజుల పులస చిక్కడం వల్లే ఇంతటి ధర పలికిందని మత్స్యకారులు చెబుతున్నారు.