Rahul Gandhi : సోషల్ మీడియాలో విషప్రచారం.. షర్మిలకు అండగా రాహుల్

Byline :  Krishna
Update: 2024-02-04 05:27 GMT

(Rahul Gandhi) వైఎస్ షర్మిల ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడంతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. జగన్ను జైలుకు పంపిన పార్టీలో షర్మిల చేరిందంటూ వైసీపీ శ్రేణులు ఆమెను విమర్శిస్తున్నారు. వైఎస్ వివేకా కుమార్తె సునీత సైతం కాంగ్రెస్ పార్టీలో చేరనుంది. దీంతో వీరిద్దరిని వైసీపీ శ్రేణులు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. షర్మిల చంద్రబాబుతో కుమ్మక్కై నీచ రాజకీయాలు చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.

మహిళలను అవమానించడం నీచమైన చర్య అని రాహుల్ మండిపడ్డారు. ‘‘మహిళలను అవమానించడం, బెదిరించడం పిరికి చర్య. దురదృష్టవశాత్తు కొంతమందికి ఇది ఆయుధంగా మారింది. షర్మిల, సునీతలపై అవమానకర దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. వారికి కాంగ్రెస్ పార్టీ సహా నేను అండగా ఉంటాం’’ అని రాహుల్ ట్వీట్ చేశారు. మరోవైపు షర్మిల రాజకీయంగా దూసుకుపోతున్నారు. ఏపీ విభజన చట్టంలోని పలు హామీలను నెరవేర్చాలని రెండు రోజుల క్రితం ఢిల్లీలో దీక్షకు దిగారు. అనంతరం ఏపీకి ప్రత్యేక హోదా కోసం పలువురు జాతీయ నాయకులను కలిశారు. 




Tags:    

Similar News