తిరుమల ఆచారాలను ప్రభుత్వం నాశనం చేస్తోంది.. రమణ దీక్షితులు

Update: 2023-11-28 03:27 GMT

 ఏపీ ప్రభుత్వంపై, టీటీడీ అధికారులపై తిరుమల ఆలయ గౌరవ ప్రధానార్చకులు రమణ దీక్షితులు ఎక్స్‌ (ట్విటర్‌)లో సంచలన ఆరోపణలు చేశారు. వాటిని ప్రధాని మోదీకి ట్యాగ్‌ చేశారు. సోమవారం ప్రధాని మోదీ శ్రీవారిని దర్శించుకున్న నేపథ్యంలో రమణ దీక్షితులు ఎక్స్‌లో పోస్ట్‌ చేస్తూ.. ‘భారత ప్రధానికి శుభోదయం. తిరుమల శ్రీవారి ఆలయ పరిపాలనను హిందూయేతర అధికారి, రాష్ట్ర ప్రభుత్వం దశలవారీగా నాశనం చేస్తున్నారు. సనాతన ఆచారాలు, టీటీడీ పరిధిలోని పురాతన నిర్మాణాల ధ్వంసం సాగుతోంది. వాటి నుంచి రక్షించి తిరుమలను హిందూ రాష్ట్రంగా అత్యవసరంగా ప్రకటించాలి. శ్రీవారి ఆశీస్సులు మీకుంటాయి.’ అంటూ ట్వీట్‌ చేశారు.

ఈ ట్వీట్‌పై కొందరు నెటిజన్లు, మేధావులు స్పందించారు. అలాగే కొందరు వైఎస్సార్‌సీపీ అభిమానులు రమణ దీక్షితులుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఆయన చేసిన అవినీతిపై విచారణ చేయాలంటూ కొందరు డిమాండ్ చేశారు. కొంతసేపటికి రమణదీక్షితులు తన ట్వీట్‌ను తొలగించారు. గతంలోనూ ఇదే తరహాలో ట్వీట్‌లు చేసిన ఆయన ఆ వెంటనే తొలగించడం గమనార్హం.

రమణ దీక్షితులు గత టీడీపీ ప్రభుత్వంలో కూడా టీటీడీ పాలనపై తీవ్ర ఆరోపణలు, విమర్శలు చేశారు. ముఖ్యంగా శ్రీవారి పింక్‌ డైమండ్‌ అదృశ్యమైందని ఆరోపించారు. ఆ తర్వాత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక ఆలయంలో ఆగమ సలహాదారుగా, ఆగమ పరిషత్‌ సభ్యుడిగా నియమితులయ్యారు. అయితే.. శ్రీవారి ఆలయ వ్యవహారాల్లో తనకు తగిన గుర్తింపు, ప్రాధాన్యత లేదన్న అసంతృప్తితో అడపాదడపా టీటీడీ పాలనపై విమర్శలు చేస్తున్నారని ఇతర అర్చకులు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.

Tags:    

Similar News