అశోక్ గజపతిరాజుకు స్వాగతం.. అర్చకులకు షోకాజ్ నోటీసులు

Update: 2023-07-15 11:19 GMT

విజయనగరం జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థం రామస్వామివారి దేవస్థానంలో మరో వివాదం రాజుకుంది. ఇటీవల ఆలయ ధర్మకర్త, కేంద్ర మాజీ మంత్రి అశోక్‌గపతిరాజు నెల్లిమర్ల వచ్చిన సమయంలో పూజలు చేశారనే కారణంగా ఐదుగురు అర్చకులకు దేవస్థానం ఈవో కిషోర్‌కుమార్‌ శుక్రవారం షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు.దీనిపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

టీడీపీ భవిష్యత్ కు గ్యారంటీ బస్సు యాత్రలో భాగంగా అశోక్ గజపతిరాజు రామతీర్థంకు వెళ్లారు. రామతీర్థం కూడలిలో అశోక్ కు ఆరుగురు ఆలయ అర్చకులు పూర్ణకలశంతో స్వాగతం పలికి ఆయనకు ఆశీర్వచనాలు అందించారు.ఈ విషయాన్ని ఆలయ ఈవో కిశోర్ కుమార్ తప్పుపట్టారు.

నిబంధనలకు విరుద్ధంగా టీడీపీ బస్సు యాత్ర వద్ద పూజలు చేశారని, అందుకే అర్చకులకు నోటీసులు జారీ చేసినట్లు ఈవో తెలిపారు. అశోక్ కు ఎందుకు స్వాగతం పలికారో వివరణ ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నారు.

పూజలు చేసిన పూజారులకు నోటీసులు ఇవ్వడంపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు. అర్చకులు ఏం చేశారని ప్రశ్నించారు. వైసీపీ నేతలకు దమ్ముంటే తమతో పోరాడాలని నెల్లిమర్ల నియోజకవర్గం టీడీపీ ఇన్‌ఛార్జ్ బంగార్రాజు అన్నారు. ఆలయ ఈవో వైస్సార్సీపీ నేత మాదిరి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News