YS Jagan Mohan Reddy : ఆ రోజే అకౌంట్లలోకి రూ.18,750.. జగన్ సర్కార్ కీలక ప్రకటన
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ తరుణంలో అధికార వైసీపీ సర్కార్ వరుసగా నిధులను విడుదల చేస్తూ వస్తోంది. అయితే వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధులు మాత్రం ఇంకా విడుదల కాలేదు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ మహిళలకు సీఎం జగన్ సర్కార్ ఈ నిధులను విడుదల చేస్తూ వస్తోంది. నాలుగో విడత నిధుల విడుదల ఇప్పటికే పలుమార్లు వాయిదా పడింది.
తాజాగా వైఎస్ఆర్ చేయూత నాలుగో విడత నిధుల విడుదల తేదీని జగన్ సర్కార్ ఫిక్స్ చేసింది. మార్చి 7వ తేదిన లబ్ధిదారుల అకౌంట్లలో నిధులను జమ చేయనున్నట్లు ఏపీ ప్రభుత్వం వెల్లడించింది. అనకాపల్లిలో నిధుల విడుదల కార్యక్రమం ఉంటుందని వైసీపీ వర్గాలు తెలిపాయి.
వైఎస్ఆర్ చేయూత పథకం కింద ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనార్టీ మహిళల్లో 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల లోపు వారికి నగదు సాయం ఇవ్వనున్నారు. మహిళల ఖాతాల్లో రూ.18,750 చొప్పున సీఎం జగన్ నిధులను జమ చేయనున్నారు. ఆదాయపు పన్ను చెల్లించని వారు, మూడు ఎకరాల తడి భూమి లేదా 10 ఎకరాల పొడి భూమికి మించిన వారు ఈ వైఎస్ఆర్ చేయూత పథకానికి అర్హులు. గత రెండు నెలల నుంచి ఈ పథకం కింద నిధుల విడుదల వాయిదా పడుతూ వస్తోంది. ఈ నిధుల కోసం మహిళలు ఎదురుచూస్తున్న తరుణంలో వైసీపీ సర్కార్ మార్చి 7న విడుదల చేస్తామని స్పష్టం చేసింది.