చంద్రబాబు కుట్రలోని అస్త్రమే షర్మిల : Sajjala Ramakrishna Reddy
వైఎస్ షర్మిలను చూస్తే జాలి కలుగుతోందని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అన్నారు. సీఎం జగన్పై షర్మిల వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. వైఎస్ కుటుంబానికి ద్రోహం చేసిన పార్టీలో షర్మిల చేరిందన్నారు. వైఎస్ కుటుంబాన్ని కాంగ్రెస్ ఎన్నో ఇబ్బందులు పెట్టిందని విమర్శించారు. జగన్‌పై పెట్టినవి అక్రమ కేసులని గులాం నబీ ఆజాదే చెప్పారని.. చివరకు వైఎస్సార్ పేరును కూడా ఛార్జ్షీట్లో చేర్చారన్నారు. కాంగ్రెస్ ఏపీలో ఉనికిలోనే లేదని ఎద్దేవా చేశారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ పనిచేస్తున్నారని.. ప్రజలు హృదయాల్లో ఆయన వారసుడిగా సుస్థిర స్థానం సంపాదించుకున్నారని చెప్పారు.
చంద్రబాబు కుట్రలోని అస్త్రమే షర్మిల అని సజ్జల ఆరోపించారు. అందుకే ఓ వర్గం మీడియాను ఆమెను నెత్తిన ఎత్తుకుందన్నారు. చంద్రబాబును సీఎం చేయడమే ఆమె లక్ష్యంగా కనిపిస్తోందని విమర్శించారు. కానీ ఆ లక్ష్యం నెరవేరదని.. ప్రజలు జగన్ వెంటే ఉన్నారని చెప్పారు. తెలంగాణలో పార్టీ పెట్టిన ఆమె హఠాత్తుగా ఏపీకి ఎందుకు వచ్చారని ప్రశ్నించారు. ఏపీలో ఎవరికి ఆయుధంలా ఉపయోగపడాలని వచ్చారో అందరికీ తెలుసన్నారు. అప్పట్లో కాంగ్రెస్ చంద్రబాబుతో కుమ్మకై ఏపీకి అన్యాయం చేసిందన్నారు. జగన్ కేంద్రంతో మంచిగా ఉండి రాష్ట్రానికి మేలు చేస్తున్నారని స్పష్టం చేశారు.