రేపటి నుంచి ఏపీలో పాఠశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు బడులకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అయితే జూన్ రెండో వారం ముగుస్తున్నా ఇప్పటికీ భానుడు భగభగమంటున్నాడు. రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేడి గాలులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని వేసవి సెలవులను పొడిగించాలని ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థుల పేరెంట్స్ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాయి. ఈ క్రమంలో సెలవులను పొడిగించనప్పటికీ ప్రభుత్వం ఒంటి పూట పాఠశాలల నిర్వహణకే మొగ్గు చూపింది. రేపటి నుంచి జూన్ 17 వరకు ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఒంటి పూట బడుల నేపథ్యంలో ఉదయం 7.30 గంటల నుంచి ఉ.11.30 గంటల వరకు మాత్రమే తరగతులు జరుగుతాయి.వేడి గాలుల తీవ్రత ఎక్కువగా ఉండటం, విద్యార్థుల తల్లిదండ్రుల వినతులను పరిగణలోకి తీససుకుని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది . ఇక ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యార్థులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఉదయం 8.30 నుంచి 9.30 గంటల బ్రేక్‌లో పిల్లలకు రాగి జావ అందించాలని సీఎం ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.