Chandrababu arrest: ఏసీబీ కోర్టులో చంద్రబాబు.. అభ్యంతరం వ్యక్తం చేసిన సీఐడీ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును సిట్ విచారించింది. శనివారం (సెప్టెంబర్ 9) ఉదయం ఆయన్ని అరెస్ట్ చేసిన సీఐడీ.. సాయంత్రం 5గంటలకు కుంచనపల్లిలోని సిట్ ఆఫీసుకు తీసుకెళ్లింది. అప్పటినుంచి బాబును సిట్ అధికారులు ప్రశ్నించారు. అయితే నిన్న సాయంత్రమే ఏసీబీ కోర్టులో చంద్రబాబును హాజరుపరచాల్సి ఉండగా.. అధికారులు జాప్యం చేశారు. దాంతో ఉద్దేశ పూర్వకంగానే అధికారులు జాప్యం చేస్తున్నారని టీడీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇవాళ (సెప్టెంబర్ 10) తెల్లవారుజామున 6గంటల సమయంలో చంద్రబాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు సిట్ అధికారులు.
ఈ నేపథ్యంలో కోర్టుకు అధికారులు రిమాండ్ రిపోర్టును సమర్పించారు. కేసులో చంద్రబాబు పాత్రపై మరిన్ని వివరాలు రాబట్టేందుకు ఆయనను రిమాండ్ కు ఇవ్వాలని సీఐడీ లాయర్లు కోర్టును కోరారు. అంతేకాకుండా చంద్రబాబు తీరుపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. కోర్టులో ప్రవేశపెట్టే టైంలో చంద్రబాబు జాప్యం చేశారని ఆరోపించింది. 24 గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలనే నియమాన్ని ఉద్దేశ పూర్వకంగా జాప్యం చేసేందుకే ప్రయత్నించారని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా బాబును ముద్దాయిగా చేర్చాలని సీఐడీ అధికారులు కోర్టులో మెమో దాఖలు చేశారు. గతంలో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ లో బాబు పేరు లేకపోవడంతో.. తాజాగా రిమాండ్ రిపోర్టులో ఆయన పేరు చేర్చి కోర్టులో మెమో దాఖలు చేశారు. ప్రస్తుతం కోర్టులో వాదనలు మొదలయ్యాయి. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి టీం వాదనలు వినిపిస్తుండగా.. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా వాదిస్తున్నారు.