ఓవరాక్షన్.. కాలేజీలో గొడవపడ్డారని గుండు గీయించారు

Update: 2023-11-29 05:11 GMT

తప్పు చేసిన విద్యార్థులను మందలించాల్సిన కాలేజీ యాజమాన్యం వారిని ఘోరంగా అవమానించింది. నలుగురిలో తలెత్తుకోనీయకుండా చేసింది. దండన పేరుతో హద్దులు దాటి ఆ విద్యార్థులందరికీ శిరోముండనం చేయించింది. ఈ అమానుష ఘటన ఏపీలోని నంద్యాల పట్టణంలో చోటుచేసుకుంది. పట్టణంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివే విద్యార్థుల మధ్య గొడవ జరిగింది. గత సోమవారం రాత్రి జూనియర్, సీనియర్ విద్యార్థుల మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. రెండు గ్రూపులుగా విడిపోయిన విద్యార్థులు పరస్పర దాడులకు దిగారు. ఈ గొడవలో పలువురు విద్యార్థులకు స్పల్ప గాయాలపాలయ్యారయి.

అయితే ఈ విద్యార్థుల గొడవ గురించి తెలిసి కాలేజీ సిబ్బంది అతిగా ప్రవర్తించారు. అప్పటికే గొడవ కారణంగా గాయపడ్డ విద్యార్థులను కాలేజీ సిబ్బంది మరోసారి కర్రలతో దాడిచేసారు. అంతటితో ఆగకుండా ఆరుగురు విద్యార్థులకు శిరోముండనం (గుండు కొట్టి) చేసి అవమానించారు. కాలేజీ సిబ్బంది విచక్షణారహితంగా దాడిచేయడంలో ఓ విద్యార్థి చేయి విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు తెలిసింది. గొడవ పడ్డ విద్యార్థులను మందలించి వదిలేయాల్సింది పోయి మరింత గాయపర్చడం.. గుండు కొట్టి అవమానించడం ఏమిటంటూ కాలేజీ యాజమాన్యంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన నంద్యాలలో చర్చనీయాంశంగా మారింది.

Tags:    

Similar News