అంగన్ వాడీ ఖర్జూరం ప్యాకెట్లో పాము కళేబరం..అవాక్కైన గర్భిణీ
By : Mic Tv Desk
Update: 2023-10-11 09:18 GMT
అంగన్ వాడీ సెంటర్లో పంపిణీ చేసిన పౌష్టికాహారం కిట్లో పాము కళేబరం రావడం కలకలం రేపింది. దీన్ని చూసిన గర్భిణీ సహా ఆమె కుటుంబసభ్యులు షాక్ అయ్యారు. ఈ ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం జంబు వారి పల్లి గ్రామంలో జరిగింది. ప్రస్తుతం ఈ కిట్ ఫొటో నెట్టింట వైరల్గా మారింది.
జంబువారి పల్లి గ్రామంలోని శాంతినగర్ అంగన్వాడీ కేంద్రంలో గర్భిణీ స్త్రీలకు వైఎస్సార్ పౌష్టికాహారం కిట్లను అందజేశారు. ఈ కిట్ ను అందుకున్న మానస అనే గర్బిణీ అందులోని ఖర్జూరపు ప్యాకెట్ ను ఓపెన్ చేయగా పాము కళేబరం ప్రత్యక్షమైంది. దీంతో కుటుంబసభ్యులు అవాక్కయ్యారు. ఈ విషయాన్ని అంగన్వాడీ టీచర్కు ఉన్నతాధిరులకు సమాచారం ఇచ్చింది. ఘటనపై విచారణ చేస్తున్నట్లు సీడీపీవో తెలిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.