ఎల్లలు దాటిన ప్రేమ.. ఇది ఫేస్ బుక్ లవ్ స్టోరీ

Update: 2023-07-29 05:31 GMT

అతనిది ఏపీలోని చిత్తూరు జిల్లా. ఆమెది శ్రీలంక. ఫేస్ బుక్లో మొదలైన పరిచయం స్నేహంగా మారింది. కొన్నాళ్లకు అది స్నేహం కాదు ప్రేమ అని అర్థమైంది. అంతే ప్రియుడితో కలిసి బతకాలన్న ఆశతో సదరు యువతి చిత్తూరులోని ప్రియుడి ఇంటికి చేరుకుంది. ఇంట్లో వాళ్లకు తెలియకుండా ప్రియుడిని పెళ్లి చేసుకుంది. అంతా బాగుందనుకున్న సమయంలో పోలీసులు ఇచ్చిన ట్విస్ట్తో తలపట్టుకుంది ఈ కొత్త జంట.

చిత్తూరు జిల్లా వి.కోట మండలం ఆరిమాకులపల్లెకు చెందిన శంకరప్ప కుమారుడు లక్ష్మణ్ తాపీమేస్త్రీగా పనిచేస్తున్నాడు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అతనికి శ్రీలంకలోని బేలంగూడు ప్రాంతానికి చెందిన విఘ్నేశ్వరితో ఫేస్ బుక్ లో పరిచయం అయింది. 7ఏండ్ల క్రితం మొదలైన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ క్రమంలో లవ్ బర్డ్స్ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ నెల 8న విఘ్నేశ్వరి టూరిస్ట్ వీసాపై చెన్నై చేరుకుంది. అక్కడకు వెళ్లిన లక్ష్మణ్ ఆమెను ఇంటికి తీసుకెళ్లాడు.

కుటుంబసభ్యులకు ప్రేమ సంగతి చెప్పడంతో వారు పెళ్లికి అంగీకరించారు. దీంతో జులై 20న వి.కోటలోని సాయిబాబా ఆలయంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. కథ సుఖాంతమైందనుకుంటున్న సమయంలో పోలీసులు అసలు ట్విస్ట్ ఇచ్చారు. శ్రీలంక యువతి ప్రేమ పెళ్లి గురించి తెలియడంతో చిత్తూరు ఎస్పీ కొత్త జంటను ఆఫీసులు పిలిపించారు. ఆమె వీసాను పరిశీలించగా.. ఆగస్టు 6తో అది ముగుస్తుందని తెలిసింది. దీంతో పోలీసులు వీసా గడువు ముగిసేలోపు దేశం విడిచి వెళ్లాలని నోటీసులు ఇచ్చారు.

పోలీసులు ఇచ్చిన ట్విస్ట్ తో కొత్త దంపతులు ఏం చేయాలో తెలియక తలపట్టుకున్నారు. నిబంధనల ప్రకారం శ్రీలంకలో ఉన్న విఘ్నేశ్వరి పేరెంట్స్ కు సమాచారం ఇచ్చి చట్టప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకోవాలని పోలీసులు సూచించారు. దీంతో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ మ్యారేజ్ చేసుకునే పనిలో పడ్డారు.

Tags:    

Similar News