తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు 8వ రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. సోమవారం ఉదయం శ్రీదేవీ, భూదేవి సమేత శ్రీమలయప్ప స్వామివారి రథోత్సవం అంగరంగ వైభవంగా మొదలైంది. భక్తజన సందోహం మధ్య ఉదయం 6.55గంటలకు రథోత్సవం మొదలైంది. తిరుమాడ వీధుల్లో స్వామివారిని రథంపై ఉరేగించారు. ఆ సమయంలో గోవింద నామ స్మరణతో తిరుమల ప్రాంగణం మారుమోగింది. మాడవీధుల్లో కళాబృందాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.
ఇవాళ రాత్రి మలయప్ప స్వామి అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. ఉపనిషత్తులు ఇంద్రియాలను గుర్రాలను వర్ణిస్తున్నాయి. ఆ గుర్రాలను అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు అని కృష్ణయజుర్వేదం చెబుతోంది. స్వామి అశ్వవాహనారూఢుడై కల్కి అవతారంలో తన స్వరూపాన్ని ప్రకటిస్తూ భక్తులను కలిదోషాలకు దూరంగా ఉండాలని తన అవతారంతో ప్రబోధిస్తున్నాడు. సాలకట్ల బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 26న ముగియనున్నాయి. స్వామివారి చక్ర స్నాన మహోత్సవంతో బ్రహ్మోత్సవాలు పూర్తి కానున్నాయి.