సరస్సు మధ్యలో ఆగిన పడవ.. రెండున్నర గంటలు అందులోనే..

Update: 2023-08-11 05:10 GMT

ఏపీ రాష్ట్ర సరిహద్దు ప్రాంతమైన తిరుపతి జిల్లా తడ మండలంలోని ఇరకం దీనికి చెందిన మత్య్సకార కుటుంబాలకు చెందిన స్కూలు విద్యార్థులకు గురువారం రాత్రి పెద్ద ప్రమాదం తప్పింది. తమిళనాడులోని యళావూరులో ఉన్న సున్నపుగుంట ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇరకం దీవిలోని పాళెంతోపు కుప్పం, మొనకుప్పంకు చెందిన సుమారు 60మంది విద్యార్థులు స్కూలు ముగించుకుని పడవలో ఇంటికి వెళుతుండగా.. నాటు పడవ మొరాయించింది. సుమారు 65 మంది విద్యార్థులు చిమ్మచీకట్లో నీళ్లలో బిక్కుబిక్కుమంటూ గడిపారు. విద్యార్థులంతా ఆందోళనకు గురవ్వడమే కాకుండా అరుపులు.. కేకలు వేశారు.




 


గురువారం పాఠశాలకు వెళ్లిన సుమారు 65 మంది విద్యార్థులు సాయంత్రం 4.45 గంటల సమయంలో ఇళ్లకు పడవలో ప్రయాణమయ్యారు. పులికాట్‌ సరస్సు మధ్యలో పడవకు వలలు చిక్కుకోవడంతో పడవ ఎటూ కదల్లేని పరిస్థితి ఏర్పడింది. పడవ డ్రైవర్‌కు ఫోన్‌ లేకపోవడంతో సమాచారాన్ని గ్రామస్థులకు తెలపలేకపోయాడు. అయితే సమయానికి రావాల్సిన పిల్లలు ఇళ్లకు చేరకపోవడంతో తల్లిదండ్రులు కంగారుపడ్దారు. తర్వాత కొద్దిసేపటికి పడవ ఆపరేటర్ సెల్ సిగ్నెల్స్ రావడంతో ఫోన్ ద్వారా సమాచారం తెలుసుకుని ఇరకం దీవి నుండి గ్రామస్తులు మూడు పడవలను తీసుకుని విద్యార్థుల కోసం పులికాట్లో ముందుకు సాగారు. మార్గమధ్యంలో పడవ నిలిచిపోయి ఉండడం గమనించి పిల్లలందరినీ ఆ బోట్‌లోకి ఎక్కించుకొని ఇళ్లకు తీసుకువచ్చారు. 3 గంటలపాటు పులికాట్‌ సరస్సు మధ్యలో బిక్కుబిక్కుమంటూ ఆ చిన్నారులంతా గడిపారు.




 


గత ఏడాది నవంబరు 9వ తేదీ ఇదే విధంగా పడవ మొరాయించి విద్యార్థులు ఇబ్బందిపడ్డ విషయం తెలిసిందే. తరచూ ఇలా జరుగుతున్నా అధికారుల్లో స్పందన కన్పించడం లేదు. ఇరకానికి రోడ్డు వసతి కల్పించాలని లేకపోతే తమను పూడికుప్పం గ్రామంలో నివాసాలు ఏర్పరుచుకునేలా చర్యలు తీసుకోవాలని వేడుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని గ్రామస్థులు వాపోతున్నారు. 




Tags:    

Similar News