ఢిల్లీ లిక్కర్ స్కాంలో మాగుంట రాఘవకు సుప్రీం కోర్టు షాకిచ్చింది. అతడికి హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేసింది. ఈ కేసులో రాఘవకు ఢిల్లీ హైకోర్టు రెండు వారాల మధ్యంతర బెయిల్ ఇచ్చింది. ఈ క్రమంలో ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీం.. ఈ నెల 12న సరెండర్ కావాలని రాఘవను ఆదేశించింది.
అమ్మమ్మకు ఆరోగ్యం బాగోలేనందున బెయిల్ ఇవ్వాలని మాగుంట రాఘవ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే బెయిల్ ఇవ్వొద్దంటూ ఈడీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం మాగుంట రాఘవకు 15 రోజుల తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఇదిలా ఉంటే బెయిల్ కోసం ఆయన చూపిన కారణాలు సరైనవి కావని.. సమీప బంధువుల ఆరోగ్యం బాగోలేదని కోర్టుకు తప్పుడు సమాచారం ఇచ్చారని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఈడీ ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో రాఘవకు హైకోర్టు ఇచ్చిన బెయిల్ను 5 రోజులకు కుదిస్తు జూన్ 12న సరెండర్ అవ్వాలని ఆదేశించింది. ఈ కేసులో రాఘవ ఫిబ్రవరి 10న అరెస్ట్ అయ్యారు.సౌత్ గ్రూప్లో రాఘవ కీలకంగా వ్యవహరించారని ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఢిల్లీలో పలు జోన్లకు రాఘవ ప్రాతినిధ్యం వహిస్తున్నారని ఈడీ ఆరోపించింది.