Skill Development Case: చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీం సంచలన తీర్పు ఇదే
స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణం కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా త్రివేదిల ద్విసభ్య ధర్మాసనం.. ఈ కేసులో భిన్నా్భిప్రాయాలు వ్యక్తం చేసింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి సారధ్యంలోని త్రిసభ్య ధర్మాసనానికి ఇవ్వాలని బెంచ్ విజ్ఞప్తి చేసింది. రిమాండ్ విధించే అధికారం ట్రయల్ కోర్టుకు ఉందని , ట్రయల్ కోర్టు విచారణలో జోక్యం చేసుకోలేమని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. చంద్రబాబుకు 17 ఏ వర్తింస్తుందని జస్టిస్ బోస్ తెలుపగా.. ఆ సెక్షన్ వర్తించదని జస్టిస్ బేలా త్రివేది తెలిపారు.
2018లో వచ్చిన సవరణ ఆధారంగా చేసుకుని కేసును క్వాష్ చేయలేమని జస్టిస్ బేలా త్రివేది అన్నారు. 2018లో వచ్చిన సవరణ కేవలం తేదీకి సంబంధించినది మాత్రమేనని, అవినీతి నిరోధక చట్టానికి 17ఏను ముడిపెట్టలేమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని నేరానికి పాల్పడిన వారికి 17ఏ రక్షణగా ఉండకూడదన్నారు. అవినీతి నిరోధక చట్టంలో ఇచ్చిన మినహాయింపు కేవలం ఉద్యోగులు కక్ష్యసాధింపుకు గురి కావద్దని మాత్రమేనని తీర్పు వెల్లడించారు. ఇక జస్టిస్ బోస్ మాత్రం ఈ కేసులో 17ఏ వర్తిస్తుందని, చంద్రబాబు కేసులో విచారణకు ముందే గవర్నర్ అనుమతి తీసుకోవాల్సిందని అన్నారు. గతంలో జరిగిన దర్యాప్తును ఈ అరెస్ట్‌కు వర్తింపజేయరాదన్నారు. అయినా చంద్రబాబుకు విధించిన రిమాండ్ ఆర్డర్‌ను కొట్టేయలేమని, అనుమతి లేనంత మాత్రాన రిమాండ్ ఆర్డర్ నిర్వీర్యం కాదని చెప్పారు.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తన అరెస్ట్ అక్రమమని, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17-ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే ఏపీ సీఐడీ తనపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసిందని చంద్రబాబు పిటిషన్ దాఖలు చేశారు. గతేడాది సెప్టెంబర్ 22న ఏపీ హైకోర్టు తన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేయడంతో ఆయన సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.