జగన్ కేసుల్లో విచారణ ఆలస్యం..సుప్రీంలో సీబీఐ ఏం చెప్పిందంటే..?
జగన్ అక్రమాస్తుల కేసులపై సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. అక్రమాస్తుల కేసులో జగన్ బెయిల్ రద్దు చేయడంతోపాటు కేసుల విచారణను తెలుగు రాష్ట్రాల నుంచి ఇతర చోటుకు బదిలీ చేయాలని ఎంపీ రఘురామకృష్ణ రాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన సుప్రీం.. విచారణ ఎందుకు ఆలస్యమవుతోందని సీబీఐని ప్రశ్నించింది. కేసుల ఆలస్యానికి తాము బాధ్యులం కాదని సీబీఐ తరుపు వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. దిగువ కోర్టులో వాయిదాలతో తమకు సంబంధం లేదని చెప్పారు.
సీబీఐ కాకపోతే ఈ ఆలస్యానికి ఎవరు బాధ్యత వహిస్తారని కోర్టు ప్రశ్నించింది. దర్యాప్తు సంస్థకే ఆ బాధ్యత ఉంటుందని చెప్పింది. అయితే రఘురామ రాజకీయ కారణాలతోనే పిటిషన్ దాఖలు చేశారని జగన్ తరుపు లాయర్లు వాదించారు. ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారనే క్షక్షతోనే పిటిషన్లు వేస్తున్నారని అన్నారు. అయితే తాము రాజకీయ వ్యవహారాలను పరిశీలించడం లేదని.. కేవలం న్యాయపరమైన అంశాలను మాత్రమే పరిశీలిస్తున్నట్లు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణ ఎందుకు ఆలస్యం అవుతోందనేదే ఇక్క ప్రధాన అంశమని స్పష్టం చేశారు. తదుపరి విచారణను ఏప్రిల్ మొదటి వారానికి వాయిదా కోర్టు వేసింది.