Chandrababu Quash Petition: ఈ రోజు క్వాష్ పిటిషన్పై విచారణ జరపలేం - సుప్రీంకోర్టు
ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టైన చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ పై అత్యవసర విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. సోమవారం నాటి మెన్షన్ లిస్టులో లేనందున కేసు వివరాలు వినలేమని స్పష్టం చేసింది. చంద్రబాబు తరఫు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కేసు వివరాలుచెప్పే ప్రయత్నంలో మంగళవారం లిస్టులో పిటిషన్ను మెన్షన్ చేయాలని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ సూచించారు.
ఏపీలో అధికార పార్టీ ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని, తప్పుడు కేసులు పెట్టి చంద్రబాబును జైలు పాలు చేసిందని సిద్ధార్థ లూథ్రా కోర్టుకు విన్నవించారు. ఏపీలో నెలకొన్న ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో అత్యవసరంగా క్వాష్ పిటిషన్‌పై అత్యవసరంగా విచారణ జరపాలని సీజేఐను అభ్యర్థించారు. అయితే లూథ్రా విజ్ఞప్తిపై స్పందించిన సీజేఐ కేసును అత్యవసరంగా విచారించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. చంద్రబాబు ఎప్పటి నుంచి రిమాండ్ లో ఉన్నారని అడిగారు. ఈ నెల 8న చంద్రబాబు నాయుడును అరెస్ట్ చేశారని ఇప్పటి వరకు ఆయన రిమాండ్లో లూథ్రా ఉన్నారని ధర్మాసనానికి వివరించారు. ఈనెల 28 నుంచి సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నందున కేసు విచారణను అత్యవసరంగా చేపట్టాలని సీజేఐ బెంచ్‌ను అభ్యర్థించారు. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో క్వాష్ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టి వేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. శనివారం నాడు స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు.
ఇదిలా ఉంటే ఈ నెల 28 నుంచి అక్టోబర్ 2 వరకు సుప్రీంకోర్టుకు వరుస సెలవులు ఉన్నాయి. సెప్టెంబర్ 28న మిలాద ఉన్ నబీ, 29న స్థానిక సెలవు, 30వ తేదీ శనివారం, అక్టోబర్ 1 ఆదివారం కావడంతో కోర్టులు పనిచేయవు. అక్టోబర్ 2 సోమవారం గాంధీ జయంతి రోజున నేషనల్ హాలిడే ఉంది. ఈ క్రమంలో చంద్రబాబు క్వాష్ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని సిద్ధార్థ్ లూథ్రా ప్రయత్నించినా సాధ్యం కాలేదు. చంద్రబాబు పిటిషన్ ఏ బెంచ్ కు కేటాయించాలన్న దానిపై సోమవారం రిజిస్ట్రీ నిర్ణయం తీసుకోనుంది.