Chandrababu Quash Petition: నేడు సుప్రీంకోర్టు ముందుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్

By :  Kiran
Update: 2023-09-26 02:42 GMT

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో అరెస్టైన చంద్రబాబు నాయుడు క్వాష్ పిటిషన్ ఇవాళ సుప్రీంకోర్టు ముందుకు రానుంది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా నమోదుచేసిన కేసును కొట్టేయాలంటూ చంద్రబాబు దాఖలు చేసిన ఎస్ఎల్పీపై ధర్మాసనం విచారణ జరపనుంది. శుక్రవారం ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి తన క్వాష్ పిటిషన్ ను కొట్టేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన శనివారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ చేశారు.

చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను ఆయన తరఫు లాయర్ సిద్ధార్థ లూథ్రా సోమవారం సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ ధర్మాసనం ముందు మెన్షన్ చేశారు. అత్యవసర విచారణ జరపాలని కోరారు. దీనిపై స్పందించిన సీజేఐ ధర్మాసనం సోమవారం లిస్టులో మెన్షన్ చేయనందున మంగళవారం రావాలని సూచించారు.

ఇదిలా ఉంటే స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో అరెస్టై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబును మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై స్పందించిన న్యాయమూర్తి కౌంటర్ దాఖలు చేయాలని చంద్రబాబు తరఫు లాయర్లను ఆదేశించింది. కేసు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది. కోర్టు గతంలో ఇచ్చిన 2 రోజుల కస్టడీలో ఆయన ఏ మాత్రం సహకరించలేదని ధర్మాసనానికి విన్నవించింది. కస్టడీ ఉత్తర్వులను చదివే పేరుతో చంద్రబాబు గంటలకొద్దీ సమయం వృథా చేశారని కోర్టు దృష్టికి తెచ్చింది. స్కాంకు సంబంధించి పలు అంశాలపై కీలక సమాచారం రాబట్టాల్సి ఉన్నందున ఆయనను మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ తన పిటిషన్ లో కోరింది.

Tags:    

Similar News