అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ వాయిదా

Update: 2023-06-13 08:09 GMT

కడప ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దుకు సంబంధించి దాఖలైన పిటిషన్పై విచారణ వాయిదా పడింది. వైఎస్ వివేకా కుమార్తె సునీత దాఖలు చేసిన పిటిషన్ ను ధర్మాసనం ఈనెల 19వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు విచారణ సందర్భంగా సునీత స్వయంగా వాదనలు వినిపించారు. పలు అంశాలను కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సీబీఐ సేకరించిన సాక్ష్యాలు, ఇతర అంశాలను హైకోర్టు పరిగణలోకి తీసుకోకుండా ముందస్తు బెయిల్ ఇచ్చిందని న్యాయమూర్తికి విన్నవించారు. ఈ కేసుకు సంబంధించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని చెప్పారు.

సీబీఐ దర్యాప్తునకు అవినాష్‌ రెడ్డి ఏమాత్రం సహకరించడం లేదని, ఏప్రిల్‌ 24 తర్వాత 3 సార్లు నోటీసులిచ్చినా ఆయన విచారణకు హాజరుకాలేదన్న విషయాన్ని సునీత కోర్టు దృష్టికి తెచ్చారు. అరెస్ట్‌ నుంచి తప్పించుకునేందుకు తల్లి అనారోగ్యాన్ని సాకుగా చూపారని ఆరోపించారు. అరెస్ట్ చేసేందుకు సీబీఐ అధికారులు వెళ్లిన సమయంలో వారిని ఎంపీ అనుచరులు అడ్డుకున్నారని చెప్పారు. ఎంపీ అవినాష్ సాక్షులను బెదిరించడంతో పాటు ఇతర నిందితులతో కలిసి వారిని ప్రభావితం చేస్తున్నారని ఆరోపించారు.

ఏపీలో అధికారపార్టీకి చెందిన కీలక వ్యక్తుల మద్దతు ఉండటంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకు పూర్తిగా సహకరిస్తోందని సునీత ధర్మాసనానికి విన్నవించారు. సీబీఐ అధికారులపై అవినాష్‌ తప్పుడు ఫిర్యాదులు చేయడంతో పాటు వారిపై ప్రైవేట్‌ కేసులు నమోదు చేయించారని అన్నారు. వివేకా హత్య గురించి సీఎం జగన్‌కు ముందే తెలిసిందని సునీత కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. సునీత వాదనల అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు ఈనెల 19కి వాయిదా వేసింది.




Tags:    

Similar News