Tirumala: తిరుమలలో భారీగా పెరిగిన భక్తుల రద్దీ

By :  Kiran
Update: 2023-09-30 07:33 GMT

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. శ్రీ వారి సర్వదర్శనానికి 20 గంటలకుపైగా సమయం పడుతోంది. క్యూకాంప్లెక్స్ లన్నీ నిండి బయట 3కిలోమీటర్ల వరకు భక్తులు క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వరుస సెలవులు ఉండటంతో తెలుగు రాష్ట్రాల నుంచి భక్తుల తాకిడి పెరిగింది. గణేష్ నిమజ్జనం, శని, ఆదివారంతో పాటు సోమవారం గాంధీ జయంతి సందర్భంగా సెలవు ఉండటంతో చాలా మంది స్వామి వారి దర్శనానికి వెళ్లారు.

మరోవైపు తమిళనాడులో పెరటాసి మాసం మొదలైనందున అక్కడి భక్తులు శ్రీవారిని దర్శించుకునేందుకు వేలాదిగా తిరుమలకు తరలి వచ్చారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ ఒక్కసారిగా పెరిగిపోయింది. పెరటాసి మాసంలో భక్తులు లక్షలాదిగా తరలి వస్తారని ముందుగానే అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అందుకు తగ్గట్లు ఏర్పాట్లు చేసింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసింది. ఆహారంతో పాటు మంచినీరు ఇతర సౌకర్యాలు అందిస్తోంది.

తిరుమలలో శుక్రవారం రాత్రి పౌర్ణమి గరుడసేవ వైభవంగా జరిగింది. రాత్రి 7 గంటలకు సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై ఆలయ మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. ఇదిలా ఉంటే తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలకు అక్టోబర్‌ 14న అంకురార్పణ జరగనుంది. అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి.

Tags:    

Similar News