చంద్రబాబు అభిమానిని మోసం చేసిన పోలీసులు.. అసలేంజరిగిందంటే..?
చంద్రబాబు ఎపిసోడ్ ఏపీలో కాక రేపుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22 వరకు ఆయనకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో ఏపీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇక బాబు అరెస్ట్తో పలువురు కార్యకర్తలు గుండెపోటుతో మరణించారు. ఈ క్రమంలో సత్యసాయి జిల్లాలో ఓ కార్యకర్త సెల్ టవర్ ఎక్కాడు. అతడికి కిందికి తీసుకొచ్చేందుకు పోలీసులు వేసిన ప్లాన్ ఫలించింది. ప్రస్తుతం పోలీసులు అతడికి చెప్పిన విషయం వైరల్గా మారింది.
శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం మైదుగోళం గ్రామానికి చెందిన మంజునాథ్ చంద్రబాబుకు వీర అభిమాని. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారనే వార్త విని మంజునాథ్ ఆందోళన చెందాడు. టీడీపీ జెండా పట్టుకొని సమీపంలో ఉన్న సెల్ టవర్ ఎక్కాడు. చంద్రబాబును వెంటనే విడుదల చేయాలని..లేకుంటే సెల్ టవర్ మీద నుంచి దూకుతానని హెచ్చరించాడు.
పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని.. నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా మంజునాథ్ వినలేదు. దీంతో పోలీసులు తెలివిగా వ్యవహరించారు. చంద్రబాబుకు బెయిల్ వచ్చిందని, ఆయన బయటకు వచ్చారని నమ్మించి మంజునాథ్‌ను కిందకు దింపారు. పోలీసుల మాటలు నమ్మిన మంజునాథ్.. సెల్ టవర్ పైనుంచి కిందకు దిగాడు. కిందికి దిగాక పోలీసులు అతడిని స్టేషన్‌కు తరలించి కౌన్సెలింగ్ ఇచ్చారు. పోలీసుల తీరుపై పలువురు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.