TDP-Janasena : ఎంపీ అభ్యర్థులను ఖరారు చేసిన టీడీపీ, జనసేన కూటమి
ఆంధ్రప్రదేశ్ లోని 25 లోక్‌సభ స్థానాలకు గాను 13చోట్ల ఎంపీ అభ్యర్థులను టీడీపీ-జనసేన కూటమి ఖరారు చేసింది. అయితే అధికారికంగా మాత్రం ఆ జాబితాను ప్రకటించలేదు. అంతర్గతంగా ఆ 13 చోట్ల పార్టీల్లో స్పష్టత వచ్చినట్లు తెలుస్తోంది. మిగిలిన స్థానాలపై కసరత్తు చేస్తోంది. అధికార పార్టీ వైసీపీ నుంచి బయటకు వచ్చిన ముగ్గురు సిట్టింగ్ ఎంపీలకు టీడీపీ తరపున స్థానాలు ఖరారు అయ్యాయి. అందులో నరసాపురం నుంచి రఘురామకృష్టంరాజు, నరసారావుపేట నుంచి లావు శ్రీకృష్ణదేవరాయలు, మచిలీపట్నం నుంచి వల్లభనేని బాలశౌరికి టికెట్లు లభించనున్నాయి.
ప్రస్తుతం 13 సీట్లలో శ్రీకాకుళం, అనకాపల్లి, విశాఖపట్నం, అమలాపురం, నరసాపురం, ఏలూరు, విజయవాడ, నరసరావుపేట, తిరుపతి, రాజంపేట, అనంతపురం, హిందూపురంలో టీడీపీ అభ్యర్థులు బరిలో నిలవనున్నారు. మిగిలిన సీట్లలో అభ్యర్థులను పరిశీలిస్తున్నారు. అరకు స్థానంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. అలాగే రాజమహేంద్రవరం సీటుకు మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు బాగా పేరు వినిపిస్తోంది.
ఇకపోతే శ్రీకాకుళంలో రామ్మోహన్‌నాయుడు, అనకాపల్లిలో దిలీప్ చక్రవర్తి, విశాఖలో ఎం.భరత్, ఏలూరులో గోపాల్ యాదవ్, విజయవాడలో కేశినేని చిన్ని, నరసారావుపేటలో శ్రీకృష్ణదేవరాయలు, అనంతపురంలో కాల్వ శ్రీనివాసులు, హిందూపురంలో బీకే పార్థసారథి, తిరుపతిలో అంగలకుర్తి నిహారికకు సీట్లను కేటాయించారు. మిగిలిన సీట్లలో అభ్యర్థులను పరిశీలిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి టీడీపీ-జనసేన కూటమి తమ ఎంపీ అభ్యర్థులను ఖరారు చేస్తోంది.