ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ మరింత ఎక్కువవుతోంది. అందులోనూ టీడీపీ, జనసేన మధ్య ఇంకా ఎవరికెన్ని సీట్లు ఉంటాయి, ఎక్కడెక్కడ ఎవరెవరు పోటీ చేస్తారు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఆ పార్టీల్లో అంతర్గతంగా సీట్ల లొల్లి జరుగుతోందని తెలుస్తోంది. దీంతో సీట్ల పంపకాల ప్రక్రియ మరింత క్లిష్టంగా మారిందని చెప్పాలి. ఇకపోతే ఎన్నికలకు ముందే పోటాపోటీగా పాదయాత్రలు సాగనున్నాయి. ముఖ్యంగా గుంటూరు జిల్లాలో పాదయాత్రల రాజకీయం సాగుతోంది. టీడీపీ బలంగా ఉండేచోట జనసేన పాదయాత్ర చేయనుంది. అలాగే జనసేన బలంగా ఉన్నచోట టీడీపీ నేతలు పాదయాత్రను చేయనున్నారు.
సత్తెనపల్లి, గుంటూరు వెస్ట్, తెనాలి ఎక్కడ చూసినా పాదయాత్రలే కనిపిస్తున్నాయి. పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలంలోని కొమరపూడిలో జనసేన మహా పాదయాత్రను తలపెట్టింది. అలాగే ఎర్రగుంటపాడుతో జనసేన నేతలు పాదయాత్రతో హంగామా చేస్తున్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కూడా జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ పాదయాత్రను చేపట్టారు. తెనాలిలో జనసేన నేత నాదెండ్ల మనోహల్ బరిలోకి దిగుతున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ తరుణంలో అక్కడి టీడీపీ నేత ఆలపాటి రాజా పాదయాత్ర చేస్తున్నారు.
ఇప్పుడు ఏపీ టీడీపీ, జనసేన పార్టీల మధ్య సమన్వయం ఉందంటూనే విడివిడిగా పాదయాత్రలు చేయడం మరింత ఆసక్తిగా మారింది. అలాగే అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల మధ్యే టికెట్ల పోరు నెలకొంది. కాల్వ శ్రీనివాసులుకు ఎంపీ టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. రాయదుర్గం టికెట్ కాల్వ శ్రీనివాసులుకు ఇవ్వని పక్షంలలో తన వారసుడు దీపక్ రెడ్డికి అవకాశం ఇవ్వాలని జేసీ ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారట. దీంతో టీడీపీ అధినేత చంద్రబాబుకు టికెట్ కేటాయింపు విషయం మరింత తలనొప్పి కానుంది. వైసీపీలో కూడా రాజకీయ రగడ మొదలైంది. టికెట్ల విషయం క్లారిటీ వచ్చేందుకు మరింత సమయం పట్టనుంది. అంతలోపు ఎవరి ట్రైల్స్ వారు వేసుకుంటున్నారు.