ఆంధప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన ప్రకటన రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. గత ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేయడం వల్లే ఓట్లు చీలి జగన్ అధికారంలోకి వచ్చారంటూ చెబుతున్న పవన్ ఈసారి వైసీపీకి ఎంతో కొంత చెక్ పట్టేందుకు పొత్తుమాట ఎత్తినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. జనసేనతో టీడీపీకి పొత్తు అక్కర్లేకపోయినా కేడర్ సహా పలు క్షేత్రస్థాయి బలాలు లేని జనసేనకే పొత్తు తప్పనిసరి అవరసమన్న వాదన మరోసారి బయటపడింది. గత ఎన్నికల్లో ఒక్కసీటు గెల్చుకుని పోగొట్టుకున్న పవన్ సేన ఈసారి ఎన్నికల్లో అమీతుమీ తేల్చుకుని కనీసం గౌరవనీయమైన స్థానాలు సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఎన్డీఏలో చేరి బీజేపీకి జైకొట్టింది.
సర్దుబాటు పెద్ద సమస్య..
టీడీపీ, జనసనేల మధ్య పొత్తు ఖరారైనా సీట్లు సర్దుబాటు, ఓట్ల మళ్లింపులో ఏమాత్రం పొరపాటు పడకుండా చూసుకోవాల్సి ఉంటుంది. చంద్రబాబు పెద్దమనసుతో చిన్న పార్టీకి కనీసం 20, 30 సీట్లన్నా కేటాయించాల్సి ఉంటుంది. మరోపక్క కమ్యూనిస్టు పార్టీలు కూడా చంద్రబాబుతో దోస్తీకి సై అంటున్నాయి కనుక అవి కూడా జట్టు కడితే వాటికీ కొన్ని సీట్లను విదిల్చక తప్పదు. ఎంతలేదన్నా కనీసం 30, 40 సీట్లు పొత్తు కింద వదులుకోవాలి. 175 సీట్లలో 40 సీట్లు పొత్తు ధర్మం కింద వెళ్తే 135 సీట్లు పచ్చపార్టీకి మిగులుతాయి. టీడీపీకి బలం లేని స్థానాలను మిత్రపక్షాలు తీసుకోవడానికి ఇష్టపడవు కాబట్టి కొన్ని బలమైన స్థానాలకు తిలోదకాలు ఇవ్వక తప్పదు. గత ఎన్నికల్లో ఘోరంగా ఓడిన టీడీపీకి వచ్చే ఎన్నికలు అగ్నిపరీక్షే. గెలవకపోయి, ఇరవై, పాతిక సీట్లతో సరిపెట్టుకున్నా శాశ్వతంగా తెరమరగయ్యే పరిస్థితి. వైసీపీ గాలి బలంగా వీస్తోందని పలు సర్వేలు చెబుతున్న నేపథ్యంలో బాబు పొత్తు ప్రయోగానికి సిద్ధపడతారా అన్నది అనుమానమే. జగన్‌కు వ్యతిరేకంగా కూడగట్టుకునే మద్దతుకు ఆయన భారీ మూల్యం చెల్లించుకునేంత అమాయకుడు కాదు, అందుకే జైలు బయటున్న లోకేశ్, బాలయ్య సహ పొత్తు గురించి వెంటనే స్పందించలేకపోయారు. వెంటనే కార్యాచరణ ఉంటుందని పవన్ చెప్పినా బాబు జైలు నుంచి వచ్చాకే చర్చలు ఉంటాయన్నది స్పష్టం.
సహకరిస్తారా?
వైపీసీ బలాన్ని తట్టుకుని నాలుగున్నరేళ్లుగా పార్టీనే నమ్ముకుని ఉన్న టీడీపీ నేతలు, శ్రేణులు పొత్తుకు సహకరిస్తారా అనేది మరో ప్రశ్న. సీట్లను, ఓట్లను త్యాగం చేసి పరాయి పార్టీకి మద్దతిచ్చేందుకు నాయకులు సిద్ధపడకపోవచ్చు. రాష్ట్రంలో టీడీపీ, వైకాపా తప్ప మరో ప్రత్యామ్నాయం లేకపోవడంతో... అంతగా అవసరమైతే వైసీపీలోకి వెళ్లేందుకు మొగ్గుచూపుతారుగాని పొత్తు కింద కెరీర్‌ను త్యాగం చేసుకోవడానికి ఒప్పుకోకపోవచ్చు. గోదావరి, విశాఖ వంటి జిల్లాల్లో పలుచోట్ల తిరుగుబాట్లు లేచే పరిస్థితి ఉంటుంది. అదే జరిగితే రెండిటీ చెడ్డ రేవడి అవుంది.
బీజేపీ కలిసి వస్తుందా?
టీడీపీ, జనసేనలతో బీజేపీ కలసి రావాలని పవన్ కల్యాణ్ కోరారు. ఏపీలో కాషాయ దళానికి ఏ మాత్రం బలం లేని సంగతి ఆయనకు తెలుసు. కాకపోతే ఎన్నికల ఏర్పాట్లు, కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు అందుతాయనే ఆశతోనే ఆ పిలుపు ఇచ్చినట్లు కనిపిస్తోంది. జగన్ కూడా మోదీకి అనుకూలంగానే వ్యవహరిస్తుండడంతో బీజేపీ.. పవన్ పిలుపుకు ఎంతవరకు స్పందిస్తుందన్నది ఆసక్తికరం. రాష్ట్రంలో పాగా వేయడానికి బేజేపీ పొత్తుకు సిద్ధపడితే సీట్ల సర్దుబాటు మరింత కష్టంగా మారుతుంది. ధరల పెరుగుదల నేపథ్యంలో మోదీ ప్రభుత్వంపై ప్రజల్లో గూడుకట్టుకుని ఉన్న ఆగ్రహానికి టీడీపీ, జనసేనలు బలికావాల్సి ఉంటుంది. ఎన్నికలకు ఇంకా ఆరేడు నెలల గడువు ఉంది కాబట్టి అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో కచ్చితంగా చెప్పడం కష్టం.
బాబు అరెస్టుతో నిజంగానే టీడీపీపై ప్రజల్లో సానుభూతి, లోకేశ్ ‘యువగళం’ పాదయాత్ర ప్రభావం, పవన్ ఎన్నికల కోసం సినిమాలకు తాత్కాలికగా బ్రేక్ ఇచ్చి ‘వారాహి’ విజయయాత్రను కొనసాగించి హోరాహోరాగా తలపడితే ఆశించినది కొంత సాధ్యం కావొచ్చు. కేడర్ బుజ్జగించి ఓట్ల బ్యాంకులను కూటమి సీట్లవైపు మళ్లించి, ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లలోకి మర్చుకుంటే ఫలితం ఉండొచ్చు. పవన్ జైల్లో బాబును పరామర్శించాక కలిగిన ఆవేశంతో పొత్తు మాటను తీసుకొచ్చినట్లు పైకి కనిపిస్తున్నా తెరవెనక ఏవో ప్రయత్నాలు సాగుతున్నాయని, బీజేపీ నాటకమాడిస్తోందనే ఆరోపణలు ఎలాగూ ఉండనే ఉన్నాయి!!