JANASENA TDP Meeting : లోకేష్, పవన్ కల్యాణ్ భేటీ.. భవిష్యత్ కార్యాచరణపై చర్చ
టీడీపీ - జనసేన సమన్వయ కమిటీ రాజమండ్రిలో భేటీ అయింది. రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు ఎదురుగా ఉన్న ఓ ప్రైవేటు హోటల్లో ఈ సమావేశం జరుగుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్, నారా లోకేష్తో పాటు 12 మంది సమన్వయ కమిటీ సభ్యులు పాల్గొంటున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీని ఎదుర్కొనే విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలు, చంద్రబాబు అరెస్టు తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై కమిటీ సభ్యులు చర్చిస్తున్నట్లు సమాచారం.
సమన్వయ కమిటీ భేటీలో జనసేన, టీడీపీ పార్టీలూ వచ్చే ఎన్నికల్లో పోటీకి సంబంధించి తమ తమ ప్రతిపాదనలను కమిటీ ముందు ఉంచనున్నట్లు సమాచారం. టీడీపీ ఈసారి జనసేనకు తక్కువ సీట్లు ఆఫర్ చేస్తోందని, అయినా పవన్ అస్సలు పట్టించుకోవడం లేదని వైసీపీ ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన తరఫున ఇచ్చిన ప్రతిపాదనలు వీరి పొత్తుకు కీలకంగా మారనున్నాయి. మరోవైపు టీడీపీ సైతం జనసేనకు పలు ప్రతిపాదనలు ఇచ్చిన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఎవరికి బలం ఉన్న చోట వారు పోటీ చేసే విధంగా, ఇరు పార్టీల సమన్వయ కమిటీలను క్షేత్రస్ధాయి వరకూ ఏర్పాటు చేసుకునేలా పలు సూచనలు చేసే అవకాశముంది. ఉదయం జైల్లో చంద్రబాబును కలిసిన లోకేష్ భేటీలో చర్చించే అంశాలకు సంబంధించి పలు సూచనలు తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే భేటీకి ముందు రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయంలో టీడీపీ సమన్వయ కమిటీ సభ్యులతో నారా లోకేష్ సమావేశమయ్యారు. జనసేన, టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల సమీపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం నుంచి ర్యాలీగా హోటల్ కు చేరుకున్నారు. మరోవైపు రాజమండ్రి ఎయిర్ పోర్టు నుంచి పవన్ కల్యాణ్ ర్యాలీగా హోటల్ కు వచ్చారు.