రేపు ఏపీ బంద్.. భారీగా పోలీసులు మోహరింపు

By :  Lenin
Update: 2023-09-10 15:06 GMT

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి అరెస్టుతో ఆంధ్రప్రదేశ్‌లో పలు చోట్ల తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒకపక్క టీడీపీ శ్రేణులు ఆందోళన, మరోపక్క వైకాపా శ్రేణులు సంబరాలు, మధ్యలో జనసేన కార్యకర్తల ఆదోళనతో రాష్ట్రం హీటెక్కింది. బాబును రిమాండ్‌తో జైలుకు పంపడాన్ని నిరసిస్తూ పచ్చ పార్టీ శ్రేణులు సోమవారం రాష్ట్రవ్యాప్తం బంద్‌కు పిలుపునిచ్చాయి. కార్యకర్తలు ఎక్కడికక్కడ ఆందోళనలు, ధర్నాలు నిర్వహించాలని నాయకులు కోరారు. జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను, రాజకీయ కక్షసాధింపును నిరసిస్తూ ప్రజలు బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. మరోవైపు బాబుకు మద్దలు ప్రకటించిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపుతో ఆ పార్టీ శ్రేణులు కూడా ఆందోళనలో పాల్గొననున్నాయి. బంద్‌తో రాష్ట్రంలో జనజీవనం స్తంభించే అవకాశం ఉంది. బంద్‌ను విఫలం చేసేందుకు ప్రభుత్వం కూడా రంగం సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర వ్యాప్తంగా హై అలర్డ్ ప్రకటించి సమస్యాత్మ ప్రాంతాల్లో పోలీసులను పెద్ద సంఖ్యలో మోహరించింది.


Tags:    

Similar News