స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును సీఐడీ అరెస్ట్ చేసింది. దీంతో ఏపీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా రాష్ట్రమంతటా టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం సిట్ అధికారులు బాబును విచారిస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబును కలిసేందుకు ఆయన తరఫు లాయర్లు ప్రయత్నించినా, సిట్ కార్యాలయంలోకి వారిని అనుమతించడం లేదు. దీంతో సిట్ అధికారుల తీరుపై న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఏ రూల్స్ మేరకు పర్మీషన్ ఇవ్వడంలేదని ప్రశ్నించారు.
సిట్ అధికారుల తీరుపై చంద్రబాబు తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సిట్ ఆఫీసులోకి గవర్నమెంటు తరఫు లాయర్లను అనుమతించి, తమను పర్మీషన్ ఇవ్వకపోవడంపై వారు ఫైర్ అవుతున్నారు. ఏ రూల్స్ ప్రకారం తమను అడ్డుకుంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఐడీ అధికారులు రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. ఇదిలా ఉండగా టీడీపీ అధినేత సిట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌కు ఓ లేఖ రాశారు. తన తరఫు న్యాయవాదులను సిట్ కార్యాలయంలోనికి అనుమతించాలని లెటర్లో కోరారు. దమ్మాలపాటి శ్రీనివాస్, పోసాని వెంకటేశ్వర్లు, ఎం.లక్ష్మీనారాయణ, శరత్ చంద్రను తనను కలిసేందుకు పర్మీషన్ ఇవ్వాలని లేఖలో తెలిపారు.
విజయవాడ ఏసీబీ కోర్టులో తమ అధినేతను హాజరుపరుస్తామని సీఐడీ ఆఫీసర్లు తెలిపినప్పటికీ..ఆయన్ని సిట్ ఆఫీస్‌లోనే ఉంచడంతో టీడీపీ నేతలు ఫైర్ అవున్నారు. దీంతో మరి కాసేపట్లో వారు గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవబోతున్నారు. గవర్నర్ కూడా వారికి అపాయింటుమెంట్ ఇచ్చారు. టీడీపీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు తదితరులు రాజ్ భవన్‌లో గవర్నర్‌ను కలవనున్నారు.