YCP:నన్ను హత్య చేయాలనే వైసీపీ గూండాలు వచ్చారు : చంద్రబాబు

Update: 2023-08-09 09:28 GMT

ఉమ్మడి చిత్తూరు జిల్లాల్లో జరిగిన ఘర్షణల నేపథ్యంలో తనతో పాటు 20 మంది టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను చంపాలని చూసి..తిరిగి తనపైనే హత్యాయత్నం కేసు పెట్టడం ఏంటని ప్రశ్నించారు. ప్రస్తుతం విజయనగరంలో పర్యటిస్తున్న చంద్రబాబు అంగళ్లు ఘటనకు సంబంధించి వైసీపీ అరాచకాలతో పాటు పోలీసులు వ్యవహరించిన తీరును పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే అంగళ్లలో విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. గొడవపై పోలీసులకు ముందే సమాచారం ఉందన్న చంద్రబాబు.. తనను హత్య చేయడానికి వైసీపీ గూండాలు వచ్చారని తెలిపారు. కమెండోలు రక్షించడంతో ప్రాణాలతో బయటపడ్డానని చంద్రబాబు వివరించారు. దాడులపై సీబీఐ విచారణ జరగాలని..తనను హత్య చేయడానికి చూసింది ఎవరో తేల్చాలని టీడీపీ అధినేత డిమాండ్ చేశారు. తనపై చాలా సార్లు దాడికి యత్నించారన్నారు. తెలుగుదేశం శ్రేణులు రోడ్డెక్కకుండా ముందస్తు అరెస్టులు చేసే పోలీసులు, అంగళ్లలో వైసీపీ శ్రేణుల్ని ఎందుకు నియంత్రించలేదని చంద్రబాబు ప్రశ్నించారు.

చిత్తూరు ఎస్పీ వైఖరిపై మండిపడ్డారు.

ఏ1గా చంద్రబాబు

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేటీ కార్యక్రమంలో భాగంగా ఇటీవల ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం

అంగళ్లులో చంద్రబాబు పర్యటన సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. వైసీపీ-టీడీపీ శ్రేణులు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురు తీవ్రంగా గాయాపడ్డారు. ఘర్షణల నేపథ్యంలో కురబలకోట మండలం ముదివీడు పోలీస్‌స్టేషన్‌లో చంద్రబాబుపై కేసు నమోదైంది.ఈ కేసులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా దేవినేని ఉమ, ఏ3గా అమర్నాథ్‌రెడ్డి, ఏ4గా రాంగోపాల్‌రెడ్డిని పేర్కొన్నారు. వారితో పాటు నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి, దమ్మాలపాటి రమేశ్‌, గంటా నరహరి, శ్రీరాం చినబాబు, పులవర్తి నాని సహా 20 మందిపై కేసు పెట్టారు. వైసీపీ నాయకుడు ఉమాపతిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

Tags:    

Similar News