Chandrababu Arrest: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్ట్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు ఏ1 గా ఉన్నారన్న అభియోగంపై సిట్, సీఐడీ అధికారులు శనివారం తెల్లవారు జామున అరెస్ట్ చేశారు. నంద్యాలలో చంద్రబాబు బస చేసిన RK ఫంక్షన్ హాల్‌కు వచ్చిన పోలీసులు ఆయనతో మాట్లాడి అదుపులోకి తీసుకున్నారు. ప్రైమా ఫేసీ లేకుండా అరెస్టు చెయ్యడానికి ఏం అధికారం ఉంది అని చంద్రబాబు ప్రశ్నించారు. తనను ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. తనది తప్పు ఉంటే, ఆధారాలు ఉంటే, ఉరి తియ్యాలని చంద్రబాబు అన్నారు. FIR చెయ్యలేదు, నోటీసులు ఇవ్వలేదన్న చంద్రబాబు .. పోలీసుల తీరును తప్పుపట్టారు. ఆధారాలు లేకుండా ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. తనను ఎందుకు రిమాండ్ చేస్తున్నారో చెప్పి, అరెస్టు చేయాలని చంద్రబాబు అన్నారు.ఓ మాజీ ముఖ్యమంత్రిని అయిన తనను అరెస్టు చెయ్యడానికి అర్థరాత్రి రావాల్సిన అవసరం ఏముందన్న చంద్రబాబు.. ఇదంతా అరాచకం కాదా అని ప్రశ్నించారు.
శుక్రవారం అర్థరాత్రి నుంచే నంద్యాలలో హడావుడి కనిపించింది. టీడీపీ అగ్రనాయకత్వం నుంచి జిల్లా నాయకులందరికీ ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఏ క్షణమైనా.. ఏదైనా జరగొచ్చనే సంకేతాలు వెళ్లాయి. అందుకు తగ్గట్లుగానే.. నంద్యాల ఎస్పీ ఆఫీసుకు భారీగా పోలీసులు చేరుకున్నారు. అనంతపురం నుంచి 6 బస్సుల్లో బలగాలు దిగాయి. SP కార్యాలయం నుంచి చంద్రబాబు బస చేస్తున్న RK ఫంక్షన్ హాల్‌కు భారీ బలగాలతో వచ్చిన పోలీసు అధికారులు చంద్రబాబును తీవ్ర ఉద్రిక్తల నడుమ అరెస్ట్ చేశారు. అధికారుల్లో డీఐజీ రఘురామరెడ్డి, జిల్లా ఎస్పీ రఘువీరా రెడ్డి ఉన్నారు.