స్కిల్ డెవలప్మెంట్ స్కాం కేసులో అరెస్టై రాజమండ్రి జైలులో ఉన్న టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని అన్నారు. ములాఖత్‌లో భాగంగా తనను కలిసిన కుటుంబ సభ్యులకు చంద్రబాబు లేఖ అందజేశారు. ఉవ్వెత్తున ఎగసిపడుతున్న ప్రజాచైతన్యంలో ఉన్నానని, విధ్వంస పాలనను అంతం చేయాలన్న జనం సంకల్పంలో ఉన్నానని అన్నారు.
ప్రజలే తన కుటుంబమన్న చంద్రబాబు.. జైలు గోడల మధ్య కూర్చొని ఆలోచిస్తుంటే 45 ఏళ్ల ప్రజా జీవితం కళ్ల ముందు కదలాడుతోందని చెప్పారు. తన రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగిందని దానికి ఆ దేవుడితో పాటు ప్రజలే సాక్ష్యమని అన్నారు. ఓటమి భయంతో తనను జైలు గోడల మధ్య బంధించి ప్రజలకు దూరం చేశామనుకుంటున్నారని, కానీ తాను ప్రజల మధ్యన తిరుగుతుండకపోయినా అభివృద్ధి రూపంలో ప్రతి చోటా కనిపిస్తూనే ఉంటానని లేఖలో రాశారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని కానీ, తాను నమ్మిన విలువలు, విశ్వసనీయతని ఎన్నడూ చెరిపేయలేరని చంద్రబాబు అన్నారు. సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించలేవన్న ఆయన.. జైలు గోడలు ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని చెప్పారు. ఆలస్యమైనా న్యాయం గెలుస్తుందని తాను బయటకొచ్చి ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని అన్నారు.
దసరాకి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించాననని ఇప్పుడు అదే రాజమహేంద్రవరం జైలులో తనను ఖైదు చేశారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలో బయటకొచ్చి పూర్తి స్థాయి మేనిఫెస్టో విడుదల చేస్తానని చెప్పారు. ఎప్పుడూ బయటకు రాని తన సతీమణి భువనేశ్వరిని.. తాను అందుబాటులో లేని ఈ కష్టకాలంలో ప్రజల్లోకి వెళ్లి వారి తరఫు పోరాడాలని కోరగా ఆమె అంగీకరించిందని అన్నారు. తన అక్రమ అరెస్టుతో తల్లడిల్లి మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించి, అరాచక పాలనను ఎండగట్టడానికి ‘నిజం గెలవాలి’ అంటూ ప్రజలకు ముందుకు వస్తున్నారని చంద్రబాబు లేఖలో ప్రస్తావించారు.