టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని ఏపీ పోలీసులు మళ్లీ అరెస్ట్ చేశారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనను మఫ్టీ పోలీసులు ఎత్తుకెళ్లారు. తర్వాత ఎలమంచిలి వద్ద 41ఏ నోటీసులు ఇచ్చి వదిలేశారు. టీడీపీ నేత నారా లోకేశ్ ‘యువగళం’ పాదయాత్రలో అయ్యన్న సహా పలువురు పార్టీ నేతలు సీఎంపై, ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలపై వైసీపీ శ్రేణులు కేసులు పెట్టాయి. జగన్ ప్రభుత్వం అయ్యన్నను కక్షగట్టి వేధిస్తోందని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ పాలనలో ప్రజాస్వామ్య మూలాలను ధ్వంసం చేస్తున్నారని పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ‘‘అయ్యన్న నిజాలే మాట్లాడారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే 60 మందిపై తప్పుడు కేసులు పెట్టారు. మీరు ఎన్ని దుర్మార్గాలు చేసినా మేం చూస్తూ ఊరుకోవాలా?’’ అని ప్రశ్నించారు. అయ్యన్న ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించారంటూ గత ఏడాది కూడా ఏపీ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేయడం తెలిసిదే.